– కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
గరిడేపల్లి, సెప్టెంబర్ 18 : గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్, సర్పంచులు మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, కటకం వేణు, త్రిపురం అంజన్ రెడ్డి కటకం రమేష్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, గుండు రామాంజిగౌడ్, జుట్టుకొండ సత్యనారాయణ, బండ నర్సిరెడ్డి, పరమేష్, మంగళగిరి నాగరాజు, చింతకాయల సైదులు, నియోజకవర్గ స్థాయి పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.