గరిడేపల్లి, సెప్టెంబర్ 18 : గరిడేపల్లి మండల కేంద్రంలోని గరిడేపల్లి తాళ్ల చెరువులో గురువారం నీటి కుక్కలు సందడి చేశాయి. చెరువులో నీటిపై వేగంగా ఈదుతూ, అప్పుడప్పుడు బయటకు వచ్చి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న పలువురు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలాల్లో కనిపించే నీటి కుక్కలు తాజాగా మండలంలోని గరిడేపల్లి తాళ్లచెరువు, రావి చెరువు పొనుగోడు చెరువులో కనిపించడం స్థానికులను ఆకట్టుకుంది. చెరువులో అనుకూలమైన నీటి వనరులు, ఆహారం లభ్యత కారణంగా నీటి కుక్కలు ఇక్కడికి వచ్చినట్లు చెరువు చైర్మన్ చామకూరి దశరథ్ తెలిపారు. అరుదుగా కనిపించే ఈ వన్య ప్రాణులను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.