గాంధీనగర్: ఒక వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెకు చివరిసారి పుట్టిన రోజు వేడుక నిర్వహించాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని బెలూన్లతో ముస్తాబు చేసి ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. (Man Kills Daughter) గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల కిషోర్ ధనక్, నిర్మాణ పనుల సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లగా తనతో ఉన్న ఐదేళ్ల కుమార్తె హిమాన్షి నోరు, ముక్కును చేతితో మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. ఆ తర్వాత ఆ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, సెప్టెంబర్ 14న పుట్టింటికి వెళ్లిన భార్య మంజుబెన్, భర్త కిషోర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించింది. అతడు స్పందించకపోవడంతో సెప్టెంబర్ 16న సాయంత్రం వేళ తన సోదరుడిని ఆ ఇంటికి పంపింది. ఎవరూ డోర్ తీయకపోవడంతో ఆమె అక్కడకు చేరుకున్నది. డోర్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి చూడగా భర్త కిషోర్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కుమార్తె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో గుర్తించిన మంజుబెన్, పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మరోవైపు ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆ గదిని బెలూన్స్, క్యాండిల్స్‌తో అందంగా ముస్తాబు చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. కుమార్తె హిమాన్షి పుట్టిన రోజు కానప్పటికీ హత్యకు ముందు చివరిసారి ఆ చిన్నారి బర్త్ డే వేడుకను కిషోర్ సెలబ్రేట్ చేసినట్లు గ్రహించారు. గదిలో, రిఫ్రిజిరేటర్లో చాక్లెట్లు ఉన్నాయి. ‘హ్యాపీ బర్త్‌డే హిమాన్షి’ అని రాసి ఉన్న కాగితం ఫ్రిజ్‌పై కనిపించింది. ఆ ఫ్రిజ్ లోపల తెల్లని దుస్తులు ధరించిన చిన్నారి మృతదేహం ఉన్నది. చిన్నారి తలపై దుపట్టా కప్పడంతోపాటు మృతదేహం కింద కుషన్లు ఉన్నాయి. పాప పెదవులపై తులసి ఆకులను కూడా అతడు ఉంచడాన్ని పరిశీలించారు.
కాగా, ఆ గదిలోని బెడ్‌పై కిషోర్ రాసిన మూడు సూసైడ్ నోట్లను పోలీసులు గుర్తించారు. తాను వ్యక్తిగత రుణం తీసుకుని ఆ డబ్బును నిర్మాణ పనులలో పెట్టుబడి పెట్టినట్లు ఒక దానిలో ఉన్నది. తన మరణం తర్వాత పాప బాధపడటం తనకు ఇష్టం లేకనే ఆమెను చంపినట్లు రెండో లేఖలో రాశాడు. క్షమాపణలు కోరడంతోపాటు పాప మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లు మూడో నోట్లో పేర్కొన్నాడు.
అయితే తన భర్త కిషోర్‌కు రూ. 7.25 లక్షలు రావాల్సి ఉన్నదని, వ్యాపార మిత్రులు మోసం చేయడంతో ఆర్థిక సమస్యల వల్ల కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య మంజుబెన్ ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిషోర్, చిన్నారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.