హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పై హైకోర్టు ( High Court ) అనర్హత వేటు వేయడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి , కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలకమైన పరిణామమని పేర్కొన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టిందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఈ తీర్పు ఒక స్పష్టమైన గుణపాఠమని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోవాలని సూచించారు.