– పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్
– నల్లగొండ ఐటీ టవర్ సమీపంలో గంటపాటు రహదారి దిగ్బంధం
రామగిరి, సెప్టెంబర్ 18 : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రతిపాదిత శక్తి (Shakthi) డిపార్ట్మెంట్లో విలీనం చేసే జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నల్లగొండ పాలిటెక్నిక్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐటీ టవర్ సమీపంలోని ప్రధాన రహదారిపై విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని, సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు నినాదాలు చేశారు.
జీవో 97ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థులు, సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకో కారణంగా నల్లగొండ పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారిపై దాదాపు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేసి వారిని అక్కడి నుంచి పంపించారు. జీవో 97 రద్దు చేసే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని స్టూడెంట్ జేఏసీ నాయకులు తెలిపారు.

‘జీవో 97ను వెంటనే రద్దు చేయాలి’