భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : అన్నదాతలు ఎరువుల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లుగా అరిగోస పడుతున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర కల్పించక, మరోవైపు పంటలను కొనుగోలు చేయక రైతులను తీవ్ర నష్టాలపాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎరువులను కూడా అందించలేక యాప్‌ల పేరుతో ఇబ్బంది పెడుతున్నాయి. గత ఏడాది యూరియా యాప్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఈ ఏడాది మరో యాప్‌ను తెచ్చిపెట్టింది.
దీంతో ఎరువులు సక్రమంగా అందక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 2,71,655 మంది పట్టాలు కలిగిన రైతులు ఉండగా అందులో కౌలు రైతులు 30వేల మందికిపైగా ఉన్నారు. ఈ సీజన్‌కు ఎరువులు 30వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నులే వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.
ఎరువుల కోసం ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఇటు రైతులు, అటు కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు కావాలంటే రైతులు వారి పేరుతో పట్టాభూమి కలిగి ఉండాలి. కౌలు రైతులకు ఎరువులు తీసుకునే అవకాశం ఉన్నా వారు ఫోన్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే పాసుబుక్ ఉన్న ఓనరు ఓటీపీ చెప్పాల్సిందే. ఇలాంటి సమయంలో ఏదో బిజీలో ఉన్న పట్టాభూమి రైతు కౌలు రైతులకు ఓటీపీ చెప్పడం కొంత ఇబ్బందిగా మారింది.

దీంతో తమకు ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న రైతులు అసలు ఓటీపీ చెప్పే అవకాశం లేకపోవడంతో ఎరువులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం కౌలు రైతులే కాదు సామాన్య రైతులు కూడా బుక్ చేసుకోవడం తెలియక ఎరువుల కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు.
సాంకేతిక పెరిగినప్పటికీ పాతకాలపు రైతులు ఇంకా చిన్నఫోన్లనే వినియోగిస్తున్నారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడం వల్ల ఎరువుల కోసం సతమతమవుతున్నారు. ఇంట్లో చదువుకున్న వ్యక్తులు ఉంటే యాప్ ద్వారా ఎరువులను బుక్ చేస్తున్నారు. కొంతమందికి చదువుకున్న వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో చిన్నఫోన్ల రైతులు ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు వచ్చి బుకింగ్ కోసం రోజంతా పడిగాపులు కాస్తున్నారు. ఒక్కోసారి బుకింగ్ కాకపోవడంతో తిరిగి ఇంటిముఖం పడుతున్నారు.
మాది గుర్రంగూడెం గ్రామం. నేను పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. ఎరువులు అవసరం వచ్చినపుడు పట్టా ఉన్న రైతు అందుబాటులో ఉండటం లేదు. ఫోన్ చేసినా దొరకడం లేదు. చాలా ఇబ్బంది అవుతున్నది. ఎరువులు సమాయానికి దొరకడం లేదు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఎరువులు ఇచ్చి ఆదుకోవాలి.
– పాయం మాధవి, కౌలు రైతు, గుర్రంపాడు, చండ్రుగొండ మండలం
నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఎరువుల బుకింగ్ నాకు తెలియదు. చిన్న ఫోన్ ఉంది. బుకింగ్ చేయాలంటే వేరేవాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. సమయానికి వారు దొరక్కపోతే ఎరువులు అందడం లేదు. యాప్‌లు తీసేసి ఎప్పటిలానే ఎరువులు విక్రయించాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతుల సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
– మిరియాల కృష్ణ, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
జిల్లాలో ఈ వానకాలం రైతులకు 35వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ప్రస్తుతం 12వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. స్టాక్ అయిపోగానే వెంటనే తెప్పిస్తున్నాము. చిన్నఫోన్లు ఉన్న, బుకింగ్ చేసుకోవడం తెలియని వారికి ఏఈవోలు అందుబాటులో ఉండి బుకింగ్ చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా ఆప్షన్ ఉంది.. కానీ పట్టా రైతులు ఓటీపీ చెప్పాలి.
– వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం