రూ.2 వేల పైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించాలన్న కేంద్రం నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే ఏ ప్రాతిపదికన దాన్ని వసూలు చేస్తున్నారో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్బీఐ, ఎన్పీఐకు కూడా నోటీసులు జారీ చేసింది. ఎండీఆర్ విధింపు చట్టబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది అంజన్ దత్తా వేసిన పిటిషన్ను సీజేఐతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఎండీఆర్ చట్టబద్ధత, దాన్ని విధించే అధికారంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. ‘ఈ వసూలు ప్రక్రియ కార్యనిర్వాహక ప్రాతిపదిక ఏమిటి? ఇది రుసుమైతే మేం అర్థం చేసుకొనేవాళ్లం. ఇది రుసుము కాదు కదా, మరైతే దీని స్వభావమేంటి’ అని అడిగింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరామన్ స్పందిస్తూ ఇది పన్ను, రుసుము కాదని.. చెల్లింపు వ్యవస్థలో భాగస్వాముల మధ్య ఉండే సెటిల్మెంట్ ఫీగా అభివర్ణించారు.