పాట్నా, మార్చి 4: బీహార్‌లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో బీహార్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో మార్పులు జరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. నితీశ్ కుమార్‌ను రాజ్యసభకు పంపేందుకు నామినేషన్ పత్రాలు సిద్ధమయ్యాయని, ఆయన వాటిపై సంతకం చేయడం ఒక్కటే మిగిలి ఉందని జేడీయూ వర్గాలు తెలిపాయి.
మార్చి 5న నితీశ్ నామినేషన్ పత్రాలను దాఖలుచేస్తారని తెలుస్తున్నది. ఈ పరిణామంతో జేడీయూలో రాజకీయ వేడి రాజుకుంది. నితీశ్ కుమార్‌ను రాజ్యసభకు పంపడానికి అవసరమైన లాంఛనాలన్నీ తుది దశలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాజ్యసభ ఎన్నికపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో జేడీయూ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం నితీశ్ కుమార్‌ను కలుసుకుని దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘ సమావేశంలో విస్తృత రాజకీయ వ్యూహంపై చర్చలు జరిగినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ గురువారం ఉదయం ఢిల్లీ నుంచి పాట్నాకు రానుండడంతో పార్టీలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళితే బీహార్‌కు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉదయిస్తున్నది. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ కోరుతుందని, అదే జరిగితే బీహార్‌లో రాజకీయంగా పెను మార్పులు తథ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీయూ రెండవ అభ్యర్థిగా రామ్‌నాథ్ ఠాకూర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని తెలుస్తున్నది. తాజా పరిణామంలో భాగంగా మార్చి 8న ప్రారంభం కావలసిన నితీశ్ కుమార్ సమృద్ధి యాత్ర వాయిదా పడవచ్చని జేడీయూ వర్గాలు చెప్పాయి. ఈ యాత్ర వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ద్వారా ముఖ్యమంత్రి నితీశ్ రాష్ట్ర రాజకీయాలకు వీడ్కోలు చెప్పి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.