Boduppal bill collector | బోడుప్పల్, మే 29: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపులలో బిల్ కలెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంటి నంబర్లు ఇప్పిస్తామని, ఆస్తి పన్నులు మినహాయింపు చేయిస్తామని అందిన కాడికి దండుకుంటున్నారని కొంతమంది కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మెడలో మున్సిపల్ కార్పొరేషన్ ఐడి, రీడింగ్ మిషన్ చేతిలో ఉండడంతో గృహ యజమానులు సొమ్ము చెల్లించి తరచూ మోసపోతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తిపన్ను ఎవరికి చెల్లించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో మూకుమ్మడిగా పదిమంది వరకు బిల్ కలెక్టర్లను తొలగించారు. స్థానిక నాయకుల కనుసన్నల్లో పని చేసే వ్యక్తులే బిల్ కలెక్టర్లుగా, చైన్ మాస్టర్లుగా నియమితులై వారికి విధేయులుగా సహకరిస్తున్నారు. లక్షల రూపాయల్లో ఆస్తి పన్ను వసూలు చేసి కార్యాలయంలో జమ చేయడంలో జాప్యం వహించడంతో అప్పటి కమిషనర్ సుమారు పదిమంది బిల్ కలెక్టర్లపై వేటువేశారు.
తాజాగా మరో సంఘటన వెలుగులోకి..
బోడుప్పల్ నగర పరిధిలోని రెండవ డివిజన్ శ్రీమాతా అరవింద కాలనీకి చెందిన అనిల్ కుమార్ రెడ్డి ఆస్తి పన్నురూ .10, 500 మణికంఠ అనే బిల్ కలెక్టర్కు ఏడాది క్రితం చెల్లించారు. కానీ ఆస్తి పన్ను చెల్లింపు కానట్టు ఆన్లైన్లో రావడంతో కంగుతిని మున్సిపల్ కార్యాలయాన్నిఆశ్రయించారు. ఆస్తి పన్ను ఆన్లైన్లో జమ చేయాలని ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆయన వాపోయారు.
అయితే బిల్ కలెక్టర్ మణికంఠ అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో గత మూడు నెలల క్రితమే అతనిని విధుల నుంచి తొలగించామని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో అనిల్ కుమార్ రెడ్డి మణికంఠపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డబ్బులు చెల్లించిన వెంటనే ఆన్లైన్ రిసిప్ట్ ఇవ్వకున్నా.. అదనపు డబ్బుల కోసం డిమాండ్ చేసినా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం