జీవక్రియలు, హృదయ స్పందనను థైరాయిడ్ హార్మోన్ నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథికి జబ్బు చేస్తే.. మనిషి మనిషిలా ఉండడు. ఆహారం, అలవాట్లు, జీవనశైలి వల్ల థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ఆ థైరాయిడ్ని కణితులు కప్పేస్తున్నాయి. వాటి తొలగింపు ఒకప్పుడు ప్రహసనం మాత్రమే కాదు ప్రమాదంగానూ ఉండేది. థైరాయిడ్ గ్రంథిలో కణితుల తొలగింపు చికిత్సలో రోబోటిక్ సర్జరీలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. రోబోటిక్ సర్జరీలో థైరాయిడ్ కణితులను ఎలా తొలగిస్తారు? ఓపెన్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ఒకప్పుడు ఓపెన్ సర్జరీ కోసం రోగి శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టాల్సి వచ్చేది. అందువల్ల రక్తస్రావం అధికంగా జరిగేది. శరీరంపై పెద్ద గాయం చేయాల్సి వచ్చేది. అంతర అవయవాల్లోనూ గాయం అయ్యేది. ఈ విధానంలో నొప్పి కూడా ఎక్కువే. గాటు పెట్టిన చోట కుట్లు వేసి మూసివేయాల్సి ఉంటుంది. ఆ కుట్లు ఆరడానికి కొంత కాలం పట్టేది. రోగి కోలుకునేదాక దవాఖానలో ఉండాల్సి వచ్చేది. సర్జరీ కోసం చేసిన గాయం కొందరిలో ఇన్ఫెక్షన్కు దారితీసేది. ఇది కూడా ప్రమాదకరమైనదే. రోగం నయమైనా గాయం మానడానికి కొంతకాలం పట్టేది. సుదీర్ఘమైన విధానం కావడం వల్ల రోగి కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది. వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడం వల్ల శస్త్రచికిత్సా పద్ధతుల్లోనూ పెను మార్పులు వచ్చాయి. ఓపెన్ సర్జరీకి ప్రత్యామ్నాయంగా ల్యాపరోస్కోపిక్ సర్జరీ వచ్చింది. ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న రంధ్రాలు చేసి, వాటి ద్వారా శరీరంలోపల రోగం బారినపడిన అవయవానికి సర్జరీ చేస్తారు. ఈ ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో ఓపెన్ సర్జరీలో చేసినట్టుగా చేతివేళ్లతో సులభంగా సర్జరీ చేయలేరు. ల్యాపరోస్కోపి పరికరాలకు చేతివేళ్లకు ఉన్న సౌలభ్యం ఉండదు. కాబట్టి అన్ని రకాల శస్త్రచికిత్సలను ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేయడం సాధ్యం కావట్లేదు. ఇరుకుగా, సున్నితమైన అవయవాలు, శరీర భాగాల్లో (గొంతు, ఛాతీలోపల, ఊపిరితిత్తులు, గుండె పక్కన) సమస్య ఉంటే ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయడం కష్టం. కాబట్టి ఆ అవయవాలకు సులభంగా చికిత్స చేయడానికి రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది.
రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చి దశాబ్దానికిపైగానే అయింది. మొదట్లో ఖరీదు ఎక్కువగా ఉండేది. మల్టిపుల్ రోబోలు అందుబాటులోకి వచ్చాక రోబోటిక్ సర్జరీల ఖర్చు తగ్గి, మెరుగైన ఫలితాలు పొందే అవకాశం వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించడం ఈ విధానం ప్రత్యేకత. ఇందులో సాధారణంగా మనదేశంలో తయారైన మంత్ర-3.0 వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స చేసే వైద్యనిపుణులు ఒక కన్సోల్ వద్ద కూర్చొని, యంత్రానికి అనుసంధానించిన సూక్ష్మ పరికరాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ చేస్తారు. ఇరుకైన, సున్నితమైన భాగాలైన గొంతు, ఛాతీ, ఊపిరితిత్తులలో, గుండె పక్కన సర్జరీ చేయాల్సివస్తే వైద్యులు రోబోటిక్ సర్జరీనే ఎంచుకుంటున్నారు.

థైరాయిడ్ ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది మెడ భాగంలో ఉంటుంది. ఈ గ్రంథిలో గడ్డలు (నోడ్యుల్స్), క్యాన్సర్, లేదా హార్మోన్ అసమతుల్యత ఉన్నప్పుడు సర్జరీ అవసరం ఏర్పడుతుంది. ఈ సమస్యలు మహిళల్లో ఎక్కువగా వస్తాయి. వీటికి సాధారణ పద్ధతిలో ఓపెన్ సర్జరీ చేస్తే గొంతుపైన పెద్ద గాటు పెట్టాల్సి వస్తుంది. సర్జరీ తర్వాత అక్కడ ఒక మచ్చ ఏర్పడుతుంది. తర్వాత కాలంలో ఆ మచ్చ ఇబ్బందికరంగా కనిపిస్తుంది. గొంతు భాగంలో స్వరపేటికకు సంబంధించిన అతి సున్నితమైన నరాలు ఉంటాయి. ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు వాటిని స్పష్టంగా చూడలేం. కాబట్టి ఒక్కోసారి ఆ నరాలు దెబ్బతింటే మాటపడిపోవచ్చు. స్వరం మారిపోయే ప్రమాదమూ ఉంది. ఈ సమస్యలు తప్పించేందుకు రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది.
రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో రోబోటిక్ పోర్డ్స్ టైటానియం (సన్నటి పైప్)ను నోరు లేదా చంకలో నుంచి లోపలికి పంపిస్తారు. ఈ పైపులు రోబోటిక్ పరికరాలు థైరాయిడ్ గడ్డలు ఉన్న ప్రదేశానికి నేరుగా దారులేస్తాయి. ఈ విధంగా చేయడాన్ని వైద్య పరిభాషలో ర్యాబిట్ పద్ధతి అంటారు. రోబోటిక్ పోర్డ్స్లోకి అతిచిన్న కెమెరా, రోబోటిక్ పరికరాలను ప్రవేశపెడతారు. కెమెరా సహాయంతో అంతర అవయవాలను కంప్యూటర్ మానిటర్లో చూస్తూ రోబోటిక్ పరికరాలతో థైరాయిడ్ గడ్డలను తొలగిస్తారు. ఈ చికిత్సా పద్ధతిని ‘స్కార్ ఫ్రీ థైరాయిడ్ ఎక్టమీ’ అంటారు. ఈ స్కార్ ఫ్రీ థైరాయిడ్ ఎక్టమీ పద్ధతిన థైరాయిడ్ గడ్డలు (నోడ్యుల్స్), గయటర్ను తొలగించవచ్చు. రోబోటిక్ సర్జరీలో 8 సెం.మీ. నుంచి 10 సెం.మీ. లోపు ఉండే గడ్డలు తొలగించడానికి మాత్రమే సాధ్యమవుతుంది. గడ్డల పరిమాణం 10 సెం.మీ. దాటితే ఓపెన్ సర్జరీతోనే తొలగించాల్సి ఉంటుంది. థైరాయిడ్ గడ్డలే కాకుండా మెడలో, గొంతులో ఏర్పడిన ఇతర గడ్డలను సైతం ఈ పద్ధతిలో తొలగించవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ గడ్డలను రోబోటిక్ సర్జరీ ద్వారా తొలగించే అంశం ఇంకా పరిశోధన దశలోనే ఉంది.