శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 29, 2020 , 00:51:05

రాఖీ.. మేడిన్‌ పెద్దపల్లి

రాఖీ.. మేడిన్‌ పెద్దపల్లి

పెద్దపల్లి రూరల్‌: పెద్దపల్లికి చెందిన ఇల్లందుల కృష్ణమూర్తి. మధ్యతరగతి వ్యాపారి. పెద్దపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ కూడా. 30ఏళ్లుగా వ్యాపార రంగంలో రాణిస్తూ బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొదట ఉప్పు అమ్మి.. ఉప్పు కృష్ణమూర్తిగా.. తర్వాత  అప్పన్నపేట వద్ద పటాకల దుకాణం నిర్వహిస్తూ (బాంబుల కృష్ణమూర్తి)గా పేరుగాంచాడు. అది సీజనల్‌లోనే వ్యాపారం కావడంతో మరోవైపు రాఖీల అమ్మకానికి శ్రీకారం చుట్టాడు. రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి రాఖీలు తెప్పించి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో చాలాఏళ్లుగా హోల్‌సేల్‌ వ్యాపారం చేశాడు. అయితే అక్కడ కొని తీసుకురావడం కొంత భారంగా ఉండడంతో సొంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2015లో తన భార్య రజనీతో కలిసి పెద్దపల్లిలో ఎస్సారార్‌(శ్రీరాజరాజేశ్వర) రాఖీల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడైన కృష్ణమూర్తి ప్రస్తుతం కౌన్సిలర్‌గా కొనసాగుతూనే రాఖీల తయారీలోనూ రాణిస్తున్నాడు. మొదట 30 మందితో ప్రారంభమైన ఈ సెంటర్‌, ఇప్పుడు 300 మందితో పరిశ్రమగా రూపుదిద్దుకోవడం విశేషం. 

వివిధ రాష్ర్టాలకు ఎగుమతి..

కృష్ణమూర్తి రాఖీలకు అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ వచ్చింది. చిన్న పిల్లల నుంచి మధ్య వయస్కుల దాకా వారి అభిరుచికి తగ్గట్టు తయారు చేస్తుండడంతో గిరాకీ పెరిగింది. వీరి వద్ద 5 నుంచి 500 దాకా ధర పలికే ఆకర్షణీయమైన రాఖీలు లభ్యమవుతుండడంతో ఏయేటికాయేడు ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వివిధ రాష్ర్టాల నుంచి రాఖీలు తెచ్చి హోల్‌సేల్‌గా విక్రయించిన ఆయన, ఇప్పుడు రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాడు. సీజన్‌లో దాదాపు 3కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. 

వందలాది మందికి ఉపాధి..

రాఖీల తయారీ కేంద్రంలో సుమారు 300 మంది ఉపాధి పొందుతున్నారు. పెద్దపల్లి పట్టణంతోపాటు పరిసర గ్రామాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. సాధారణంగా రాఖీల పౌర్ణమి ఆగస్టులో వస్తుండగా, నవంబర్‌ నుంచి పండుగకు పది రోజుల ముందు వరకూ రాఖీలు తయారు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తయారీపై పట్టుసాధించిన మహిళలు చాలా మంది ఇంటివద్దే స్వయం ఉపాధి కింద  రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడం విశేషం. 

ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న..

మా నాన్న కమాన్‌పూర్‌ రైస్‌మిల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నడు. నేను డిగ్రీ దాకా చదివిన. ఖాళీగా టైం వేస్ట్‌ చేయకుండా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని అనుకున్న. పెద్దపల్లిలోని రాఖీల తయారీ కేంద్రంల ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. నాకు రోజుకు 250 దాకా వస్తున్నయ్‌. - సర్వ మనీషా, సాగర్‌ రోడ్‌ (పెద్దపల్లి)

నాలుగేళ్లుగా తీసుకపోతున్న.. 

మాది గుంటూరు జిల్లా నర్సరావుపేట. నేను రాఖీల హోల్‌సేల్‌ వ్యాపారం చేస్త. ఇంతకుముందు కలకత్తా, అహ్మదాబాద్‌ల రాఖీలు తెచ్చి అమ్మేటోళ్లం. అయితే ఓ రోజు చిన్న పని మీద వరంగల్‌కు వచ్చిపోతుంటె పెద్దపల్లిలో రాఖీల తయారీ కేంద్రం గురించి తెలిసింది. వెంటనే కృష్ణమూర్తిని కలిసి మాట్లాడిన. నాలుగేళ్లుగా ఇక్కడి నుంచే రాఖీలు తీసుకుపోయి మా ప్రాంతంలో హోల్‌సేల్‌, రిటేల్‌గా విక్రయిస్తున్న. రక్షా బంధనాలు ఇక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతయ్‌. - మల్లికార్జున్‌రావు, వ్యాపారి, నర్సరావుపేట (గుంటూరు జిల్లా)

తక్కువ ధరకు అందించాలనే.. 

నేను చాలా ఏళ్ల నుంచి రాఖీల వ్యాపారం చేస్తున్న. రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలో కొనుగోలు చేసి, ఇక్కడ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వ్యాపారులందరికీ హోల్‌సేల్‌గా విక్రయించిన. రవాణా భారం పడడంతో అధిక రేట్లకు అమ్మాల్సి వచ్చేది. వినియోగదారులకు అతి తక్కువ ధరకే రాఖీలు అందించాలని అనుకున్న. ఐదేళ్ల కింద పెద్దపల్లిలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన. మంచి గిరాకీ వస్తున్నది. ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి చేస్తున్నం. - ఇల్లందుల కృష్ణమూర్తి, రాఖీ తయారీ కేంద్రం నిర్వహకుడు