‘తెలంగాణ బతుకమ్మ’గా పేరుగాంచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లు కేవలం అభియోగాలను కేంద్రంగా తీసుకొని ఆమెను 2024, మార్చి 15న అరెస్టు చేసి జైలుకు తరలించాయి. అయితే ఐదున్నర నెలలు గడిచినా ఈ కేసులో సదరు దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు రుజువు చేయకపోవడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు బాధితురాలైన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుచేసింది.
సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుతో ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం మరింత పెరిగింది. అన్యాయంపై న్యాయం గెలిచిందంటూ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. ఈ నేపథ్యంలో గత పదేండ్లుగా దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను మననం చేసుకుందాం. సుదీర్ఘ కాలం తర్వాత 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నది. ‘మేము చెప్పిందే వేదం’ అంటూనే రాష్ట్ర ప్రభుత్వాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. 2019లో ప్రజలు మరోసారి ఆ పార్టీకి అధికారం కట్టబెట్టడంతో ఇక బీజేపీకి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. కేంద్రంలోనే కాదు, రాష్ర్టాల్లోనూ తమ పార్టీనే చక్రం తిప్పాలనుకున్న దురాశతో ప్రజలు తిరస్కరించిన రాష్ర్టాల్లోనూ బీజేపీ జెండాను నిలబెట్టేందుకు ఆ పార్టీ పెద్దలు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీయేతర రా్రష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతూ వచ్చారు. తాము చెప్పినట్టు విన్న నాయకులకు డబ్బులు ఎరగా చూపిస్తూ, లొంగని నాయకులపై కేంద్ర ప్రభుత్వం తమ అనుంగు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పింది. కొందరు నాయకులను ఉదాహరణకు తీసుకున్నటయితే… పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత సువేందు అధికారిని శారద మల్టీ లెవల్ మార్కెట్ కుంభకోణంలో విచారణ పేరిట వేధించింది. ఈ వేధింపుల నుంచి విముక్తి లభించాలంటే బీజేపీలో చేరాలంటూ సంకేతాలు పంపింది. 2014 నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఆయన ఆఖరికి 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ కేసు ఊసే లేదిప్పుడు. మరో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నారాయణ్ రాణేపై మనీ లాండరింగ్ కేసులో ఈడీ తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌ను వదిలి బీజేపీకి మద్దతు పలికారు. అంతే ఈడీ దర్యాప్తుకు బ్రేక్ పడింది. అసోం సీఎం హిమంత బిశ్వదీ అదే కథ. ఆయన కూడా శారద కుంభకోణంలో నిందితుడు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన కొద్ది కాలానికే 2014లో బిశ్వ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. బీజేపీ నుంచి తాను ఎలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ముందే గ్రహించిన బిశ్వ 2015లో బీజేపీ తీర్థం పుచ్చు కున్నారు. అంతే వాషింగ్ పౌడర్ నిర్మా వాడినట్టే ఆయనపై అవినీతి మరకలు మాయమయ్యాయి. ఇట్లా.. గత పదేండ్లుగా దారికి వచ్చిన నేతలకు తమ పార్టీ కండువా కప్పుతూ, ధిక్కరించిన నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పైశాచికానందా న్ని పొందుతున్నది. ఇందులో భాగంగానే ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై కేసు తెరపైకి వచ్చింది.
దేశమంతా ఏకచ్ఛత్రాధిపత్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఇటు ఢిల్లీలో, అటు తెలంగాణలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నాడు తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారు. వీరిని అడ్డు తొలగించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం తన పంజరంలో ఉన్న చిలకలైన దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకున్నది.
ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడు దొరుకుతాయా అని కాచుకు కూర్చున్న దర్యాప్తు సంస్థలకు ఢిలీ మద్యం పాలసీ కనిపించింది. ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా, సౌత్ గ్రూప్‌గా పేరుబడ్డ మద్యం వ్యాపారులకు ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలకు పాల్పడ్డారనీ, తద్వారా మద్యం వ్యాపారుల నుంచి వందకోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవితపైనా ఇదే కేసులో, ఈ రకమైన ఆరోపణలే చేశాయి. అందులో భాగంగా ఆమెను 2024, మార్చి 15న అరెస్టు చేసి జైలుకు తరలించాయి. అయితే ఐదున్నర నెలలు గడిచినా ఒక్క ఆధారం చూపెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అరెస్టు ఉద్దేశపూర్వకంగా చేసిందనే విషయం దేశ ప్రజలకు అర్థమైపోయింది.
బీఎల్ సంతోష్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్నం చేసిన తీరు బీజేపీని దేశవ్యాప్తంగా దోషిగా నిలబెట్టింది. అందుకే కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు పాల్పడింది. అయితే… అసమాన ప్రతిభా పాటవాలు, అద్భుత వ్యక్తిత్వం ఉన్న ధీరవనిత, తెలంగాణ బతుకమ్మ అయిన కవితను ఈ అక్రమ అరెస్టులు అడ్డుకోవనే విషయం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అర్థం కాకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత నెల 27న రాత్రి 9 గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలైన అనంతరం చెమర్చిన కండ్లతో ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. ‘ఐదున్నర నెలల నా ఈ పరిస్థితికి కేవలం రాజకీయాలే కారణం. వాటివల్లే నన్ను జైల్లో వేసినట్లు దేశం మొత్తానికి తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవిత వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
చివరగా చెప్పేదేమంటే… సీబీఐ, ఈడీ, ఐటీ అనే దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయన్నది వాస్తవమే, అయినా ఆ సంస్థలు తమ పనితీరులో స్వతంత్రంగా, స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించాలి. అంతేకానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సెల్యూట్ కొట్టి ‘ఎస్’ బాస్ అన్నట్లుగా వ్యవహరించకూడదు. ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థల అధిపతులపైనా సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టిసారించాలి. రాజకీయాలకతీతంగా వీరిని నియమించాలి. అప్పుడే ఈ సంస్థలు ఎవరికీ తలవంచకుండా, ఎవరిపట్లా పక్షపాతం వహించకుండా వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్య పరిధిలో పనిచేస్తాయి. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును కొట్టి పారేసిన సుప్రీంకోర్టు… ‘ఉన్నత చదువులు చదివారనో, ఉన్నత స్థానాల్లో ఉన్నారనో, ఎమ్మెల్యే, ఎంపీ హోదా కలిగి ఉన్నారనో మహిళలకు సెక్షన్ 45(1) కింద ఉన్న ప్రయోజనాలను తిరస్కరించాలని చెప్పలేద’ని పేర్కొనడం కొసమెరుపు.