ఇల్లెందు, అక్టోబర్ 28 : ఇల్లెందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం రైతు వేదిక వద్ద రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నాయిని రాజు, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ.2,400 ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు రైతులను మోసం చేస్తూ అతి తక్కువ ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వస్తాయని ఆశించిన రైతులు అధిక వర్షాలలో తమ పంటలు నష్ట పోవాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికే అనేక మంది రైతులు తమ పంటను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తడిసిన, మొలకెత్తిన రంగు మారిన మొక్కజొన్నలను అనేక వంకలు పెట్టి రైతుల దగ్గర నుండి వ్యాపారులు తన్నుకుపోతున్నారని ఇందువల్ల పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారుల చిల్లర కౌంటర్లను అరికట్టడంలో ప్రభుత్వం అధికారులు విఫలమవుతున్నారని, ఇది వారికి మంచి ఆదాయ వనరుగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న తదితర పంటలన్నింటిని కొనుగోలు చేయుటకు ఇల్లెందు మండలంలో విస్తృతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగు మారిన మొక్కజొన్నలను కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.
ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎరువుల కొరత, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇప్పటికే నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక కొమరారం ఎస్ఐ జోక్యంతో రైతులు రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా డివిజన్, మండల.నాయకులు ఎదలపల్లి సావిత్రి, అజ్మీర బిచ్చ, శ్రీరామ్ కోటయ్య, ఆవుల కిరణ్, బుర్ర రాఘవులు, స్వర్ణపాక రామ్మూర్తి, బానోతు లస్కర్ జూకంటి గాంధీ, ఇస్లావత్ కోటేశ్, ధరావత్ దేవ, వెలుగు శాంతారావు, బుర్ర లక్ష్మయ్య, చాట్ల వెంకన్న, బండి నారాయణ, తేలే లక్ష్మయ్య, మోడం సంపత్, కోడి కృష్ణ, బొల్లం శ్రీను, గుగులోత్ బద్రు, బానోత్ బిచ్చ, గుగులోతు వీరన్న, కేలుతూ లక్ష్మణ్, భానోత్ అశోక్, వాంకుడోత్ బాలాజీ, అజ్మీర పాపన్న, అజ్మేరా సీతారాం, చొప్పదండి రాములు, సత్యం, కుంజ సమ్మన్న, అలవాల కోటేశ్, భూక్య పాషా, కాంపాటి మహేశ్, బానోత్ బాలకృష్ణ, ధరావత్ హుస్సేన్, భూక్య పాల్గొన్నారు.

Yellandu : మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాస్తారోకో