ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత మధురమైన విజయాల్లో ఒకటిగా భావించే ఈడెన్ గార్డెన్స్ టెస్టులో టీమ్ఇండియాను ఫాలోఆన్ ఆడించి తప్పుచేశానని నాటి ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ జాన్ బుకానన్ అభిప్రాయపడ్డాడు. సరిగ్గా పాతికేండ్ల క్రితం 2001, మార్చి 11న కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, ఆసీస్ మధ్య జరిగిన ఈ టెస్టు గురించి బుకానన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడీ స్టెడీ గో కిడ్స్’ కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన బుకానన్ మాట్లాడుతూ.. ‘కోచ్‌గా నేను తీసుకున్న అత్యంత పేలవమైన నిర్ణయాల్లో ఒకటిగా దానిని (భారత్‌ను ఫాలోఆన్ ఆడించడం) భావిస్తాను.
అప్పటికీ ఆ మ్యాచ్‌లో మేం తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల ఆధిక్యం సాధించి మెరుగైన స్థితిలో ఉన్నాం. డ్రెస్సింగ్‌రూమ్‌కు ఆటగాళ్లంతా వచ్చాక అప్పటికున్న ఆప్షన్స్ ఏంటో చర్చించుకున్నాం. మా జట్టు మళ్లీ ఫీల్డ్కి వెళ్లాలని, భారత్‌ను ఫాలోఆన్ ఆడించాలనుకుంటుందని గట్టిగా నమ్మాం. కానీ మేం మళ్లీ బ్యాటింగ్ చేయాలనేదానిపై అప్పుడు నేను ఆలోచించలేదు. మా దృష్టంతా సిరీస్ నెగ్గడంపైనే (మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ అప్పటికే ఒక టెస్టు గెలిచింది) ఉంది. అందుకే మేం భారత్‌ను ఫాలోఆన్ ఆడించాం. ఇక తర్వాత జరిగిందేంటో ప్రపంచానికి తెలుసు’ అని అన్నాడు.
ఆ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 రన్స్ చేయగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 171 రన్స్‌కే ఆలౌట్ అయింది. కానీ ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 657/7 పరుగుల రికార్డు స్కోరు చేసింది. హైదరాబాదీ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రావిడ్ (180) 376 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ఆఖరి రోజు ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌట్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత సుమారు రెండున్నర దశాబ్దాలుగా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్లు.. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించడమే (మరీ ముఖ్యంగా భారత్‌లో అయితే ఆ సాహసమే ఎవరూ చేయడం లేదు) మానేశాయి.