Koppula Eshwar : ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ఉన్నత భవిష్యత్తు కోసం కలలు కంటున్న మన తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను ముఖ్యమంత్రి అసభ్యకర రీతిలో “క్రిమినల్ వేస్ట్” అని సంబోధిస్తూ తీవ్రంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కొప్పుల పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కొప్పుల ప్రెస్ నోట్విడుదల చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల భవిష్యత్తును, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

’మన తెలంగాణ బిడ్డలు ఇంజనీరింగ్ పూర్తి చేసి, ప్రపంచ వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అమెరికా, యూరప్ వంటి ఎన్నో దేశాల్లోని అగ్రగామి సంస్థల్లో అత్యున్నత స్థాయి పదవుల్లో రాణిస్తూ దేశానికి, మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అలాంటి విద్యార్థుల కష్టాన్ని, తెలివితేటలను కించపరిచే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?’ అని కొప్పుల ప్రశ్నించారు.
లక్షలాది మంది విద్యార్థుల, వారి తల్లిదండ్రుల మనోభావాలతో ఆడుకోవద్దని సీఎంకు ఆయన హితవు పలికారు. ఇంజనీరింగ్ విద్యార్థుల శ్రమను, మేధస్సును అవమానించినందుకు ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థులకు, వారి కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ ఒక్క వ్యాఖ్యను కూడా బీఆర్ఎస్ పార్టీ సహించబోదని, విద్యార్థుల తరఫున పోరాడేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.