2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవుతున్నారు. గత 18 నెలల్లో సుమారు 12 వేల మంది రిటైర్ అవ్వగా, వారికి బెనిఫిట్స్ అందలేదు. దీంతో కుటుంబ అవసరాలు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురై అవస్థలు పడుతున్నారు. మానసిక క్షోభతో గుండెపోటు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండటం బాధాకరం.
హన్మకొండ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సిబ్బంది ఒకరు ఈ మధ్య స్ట్రోక్‌తో మరణించారు. ఇదే మండలంలోని పైడిపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్ అయిన జూనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మణ్ బ్రెయిన్ స్ట్రోక్‌తో, మహబూబ్‌నగర్ జిల్లా గండేడు మండలంలో పనిచేసిన కుడుముల కొండయ్య తీవ్ర అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకునే స్థోమత లేక మరణించారు. రంగారెడ్డి జిల్లా పీజీహెచ్ ఎస్.మనోహర్‌రావు మానసిక సమతూకం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విధంగా అనారోగ్యంపాలై, మానసిక ఒత్తిడికి లోనవుతున్న రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. రాష్ట్రంలో గత 18 నెలల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడుతూ 18 మంది చనిపోయారు. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ప్రభుత్వ పాలన సక్రమంగా సాగడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేది ఉద్యోగులే. అందుకే, ఉద్యోగులకు జీతభత్యాలు, ఇతరత్రా ప్రయోజనాలను సకాలంలో చెల్లిస్తే వారు మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారు. వారు చురుగ్గా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడంతోపాటు ఇతర బకాయిలను వెంటనే చెల్లిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పీఆర్సీ అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల రోగాలకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్‌కార్డులు జారీచేస్తామని వాగ్దానం చేసింది. ఈ మేరకు మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని నేడు ఉద్యోగులు కోరుతున్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక హామీల అమల్లో విఫలమైన ప్రభుత్వం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విశ్వాసాన్ని కోల్పోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా రిటైర్మెంట్ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇచ్చిన మాటను తప్పింది. 61 ఏండ్ల ఉద్యోగ విరమణ వయస్సు 2024 మార్చి నుంచి ప్రారంభమైంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు దాదాపుగా 12 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈఎల్ హాప్-పే లీవ్, ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్స్, జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, జీఐఎస్, పీఆర్సీ ఏరియర్స్, సరెండర్ లీవ్స్ తదితర బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. హోదా, సర్వీస్ ఆధారంగా వారు నిల్వ చేసుకున్న జీపీఎఫ్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్కొక్కరికి సుమారుగా రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రావాల్సి ఉన్నది.
ఇందులో గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంతకాలం దాచుకున్న సొమ్ము తాము రిటైర్ అయ్యాక అందుతుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడం.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆశలను అడియాసలు చేస్తున్నది. ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వడం లేదు. దీంతో ఎంతో మంది మనోవేదనకు గురవుతున్నారు. రోగాల బారినపడి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. చివరికి కొంతమంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగికి ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాతో సత్కరించి, ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, ఆ విధానం ఊసే లేదు. 2024 మార్చి నుంచి ప్రతి నెల రిటైర్ అవుతున్నవారి సంఖ్యతో పాటే బెనిఫిట్స్ బకాయిలూ పెరుగుతున్నాయి. గత జూన్‌లో ప్రకటించిన డీఏ ఏరియర్స్‌ను 2024 ఏప్రిల్ నుంచి 2025 ఆగస్టు వరకు రిటైర్ అయినవారికి 28 వాయిదాలలో చెల్లించాల్సి ఉంది. కానీ, వాటిని కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2025 ఏప్రిల్ నుంచి రిటైర్ అయినవారికి నెలవారీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.
పెండింగ్ బకాయిలను క్లియర్ చేసేందుకు మే నుంచి ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఆ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఒక నెల రూ.300 కోట్లు, మరో నెల రూ.280 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. బకాయిలను నెల నెల చెల్లించకపోవడంతో కొంతమంది ఉద్యోగులు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించారు. వారికి ఆరు లేదా పది వారాల్లో బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో చాలామంది కోర్టు ధిక్కార కేసులు కూడా వేశారు. అయినా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదు. ఈ నేఫథ్యంలోనే తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను త్వరగా చెల్లించి తమ జీవితాలను, తమ కుటుంబ సభ్యుల జీవితాలను కాపాడతారని 12 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.
– (వ్యాసకర్త: విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రధాన కార్యదర్శి- రిటైర్డ్ ఎంప్లాయీస్ (బెనిఫిట్స్) సాధన కమిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లా)
– కడారి భోగేశ్వర్ 98852 28213