అమెరికా కలకు ఆలంబన ‘డాలర్’.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ‘డాలర్’.. బంగారం బదులుగా ‘డాలర్’.. బంగారానికి సమానం ‘డాలర్’..! మరి ఈ డాలర్‌కు ఏదో ముప్పు ముంచుకువస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ఆందోళన చెందుతున్నట్టు? బ్రిక్స్ దేశాలు డాలర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ వాటిపై భారీ టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ బెదిరింపుల వెనుక కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు నేటి సమకాలీన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దానిలో అమెరికా స్థితిగతుల తాలూకు వాస్తవాలను వెల్లడిస్తాయి!
మొదటగా, వివిధ దేశాల కరెన్సీలకు వాటి వాటి బలం లేదా బలహీనతలకు పునాదిగా ఉండేదేమిటి? అనే అంశాన్ని తీసుకుందాం. ఇక్కడ ప్రాథమికంగా, ప్రపంచంలో ఏ కరెన్సీ అయినా, సాధారణంగా కాగితంపై ముద్రితమైనదే అనేది తెలిసిందే. ఇటువంటి ఈ కరెన్సీలను అపరిమితంగా, అంటే ఎంత కావాలంటే అంత ముద్రించగలగడం సాధ్యమేనన్నది కూడా తెలిసిందే. మరి అటువంటప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలకు వాటి వివిధ రకాల కరెన్సీలు ఉండగా.. అందులో డాలర్‌కే ఎందుకు ఇంతటి ప్రాధాన్యం? అనేది ఇక్కడి మొదటి ప్రశ్న. రెండవది, తమ తమ కరెన్సీలను, అపరిమితంగా ముద్రించుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆయా దేశాలు ఎందుకు ఆ విధంగా చేయవు? అనేది.
ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ‘బలం’ అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ను వెనక్కి తోసివేసి, ప్రపంచంలో బలమైన ఆర్థిక, సైనికశక్తిగా అమెరికా ముందుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం, అస్థిరత, ఆర్థిక వినాశనంతో అలసిపోయిన ప్రపంచం ఇక తరువాతి కాలంలో, ప్రపంచ యుద్ధాలు, అశాంతి, ఆర్థిక అభద్రతలు లేని సుస్థిరత దిశగా సాగాలని కోరుకుంది.
ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నింటినీ సమన్వయపరుచుకుని వాటి మధ్య వచ్చే విభేదాలు, వైషమ్యాల పరిష్కారానికి ఒక వేదికగా ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. మరో పక్కన ప్రపంచానికి ఒక సుస్థిరమైన ఫైనాన్స్ వ్యవస్థను అందించేందుకుగాను ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థలు కూడా పుట్టుకువచ్చాయి. ఈ ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థల ఆవిర్భావం 1944లో అమెరికాలోని న్యూహాంషైర్లోని బ్రెట్టన్వుడ్స్లో 44 దేశాల సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలోనే డాలర్ కరెన్సీకి ప్రస్తుతపు దాని అగ్రగామి స్థానాన్ని కట్టబెట్టిన నిర్ణయం కూడా జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం అమెరికా కరెన్సీ డాలర్ ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అయ్యింది. అంటే, వివిధ ప్రపంచ దేశాల మధ్యన జరిగే వ్యాపారం, లావాదేవీలలో వినియోగించుకునే మారకం సాధనంగా డాలర్‌ను నాటి బ్రెట్టన్‌వుడ్స్ సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించుకున్నాయి. ముందుగానే చెప్పుకొన్నట్టుగా దీనికి కారణం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రపంచ ఆర్థిక- సైనికశక్తిగా అమెరికా ఆవిర్భవించి ఉండటమే. అంటే, నాడు డాలర్‌ను అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా అంగీరించడానికి కారణం అమెరికాకు నాడు ఉన్న ఆర్థిక బలమే. ఇక్కడ గమనించవలసిన అంశం, ఒక దేశం కరెన్సీ తాలూకు బలం… ఆమోదయోగ్యత అనేది ఆ దేశం తాలూకు ఆర్థిక పాటవం మీద ఆధారపడి ఉంటుందన్నది.
1944 నుంచి నేటివరకూ డాలర్ బంగారంతో సమానంగా… ఆ మాటకొస్తే కాస్తంత ఎక్కువగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా కొనసాగింది. కానీ, నేడు ఆ స్థితి మెల్లగానో.. లేదంటే వేగంగానో మారిపోతోంది. ‘మా డాలర్‌ను మీరు కాదంటే, లేదంటే దానిని సవాలు చేస్తే… దానికి ప్రత్యామ్నాయాలను ముందుకు తేవాలని చూస్తే సహించం… మీ అంతుచూస్తాం… భారీ టారిఫ్‌తో (వ్యాపార సుంకాలు) మీ ఎగుమతులను దెబ్బతీస్తాం’ వంటి బెదిరింపులతో, డాలర్‌ను పదిలపరుచుకునే ప్రయత్నాలకు, నేడు స్వయానా అమెరికా అధ్యక్షుడే దిగజారిపోవలసివస్తోంది. అదీ కథ.
మరి ఈ కథ ఏ కంచి దిశగా వెళ్తుందో చూసేముందు, 1944 నుంచీ నేటివరకూ డాలర్ ప్రయాణం, ప్రస్థానాలను కాస్తంత చూద్దాం. 1944లో బ్రెట్టన్‌వుడ్స్ సమావేశంలో డాలర్‌ను అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా నిర్ణయించినప్పుడు దానిని బంగారంతో ముడిపెట్టారు. అంటే, ఒక ఔన్స్ (31.103 గ్రాములు) బంగారం విలువ 35 డాలర్లు అని నిర్ణయించారు. దీనికి కారణం కాగితం కరెన్సీ అయిన డాలర్, అమెరికా ప్రభుత్వం అపరిమితంగా ముద్రించే అవకాశాన్ని నిలువరించడం. అలాగే, డాలర్ కరెన్సీకి ఒక విలువను, ఆమోదయోగ్యతను కల్పించడం. కాగితానికి అంటూ, అది కరెన్సీ రూపంలో ఉన్నా దానికంటూ పెద్దగా విలువ ఉండదు. పైగా, ఈ కాగితాన్ని అపరిమితంగా ముద్రించే అవకాశం ఉన్నప్పుడు ఇది మరింత నిజం. కాబట్టి, కరెన్సీ రూపంలో చెలామణిలో ఉన్న ఈ కాగితానికి విలువను కల్పించేదే ఈ బంగారంతో దానిముడి.
అంటే, అమెరికా ప్రభుత్వం కనుక 35 డాలర్లను ముద్రించాలంటే డాలర్లకు వెన్నుదన్నుగా ఒక ఔన్స్ బంగారాన్ని నిలువపెట్టాలి. డాలర్లకు వెన్నుదన్నుగా, బంగారం అనే భరోసా ఉందనే సూచికగానే అమెరికా కరెన్సీ డాలర్ నోటుపైన ‘ఐ ప్రామిస్ టు పే ద బేరర్’ (I Promise to Pay the Bearer) అనే మాటలుంటాయి. దీని అర్థం ఉదాహరణకు ఒక వంద డాలర్ల కరెన్సీ నోటు గనుక ఉంటే, ఆ నోటు విలువ మేరకు అమెరికా ఫెడరల్ బ్యాంక్ తాను ఆ నోటును కలిగి ఉన్న వ్యక్తికి ఆ వంద డాలర్ల విలువచేసే బంగారాన్ని ఇవ్వగలను అనే హామీ ఇవ్వడం.
అలాగే, ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీ నోట్లపై కూడా ఇటువంటి అర్థం వచ్చే మాటలే ఉంటాయి. దీనర్థం, ఆయా కరెన్సీలను ముద్రించిన కేంద్ర బ్యాంకులు ఆ కరెన్సీకి విలువను గ్యారెంటీ ఇస్తూ ఆ కాగితం వెనుక తానున్నాననీ.. దాని విలువకు తాను పూచీదారుడినని చెప్పడమే. కేంద్ర బ్యాంకులు ఇచ్చే ఈ వాగ్దానం వెనుక ఉండేది అవి నిల్వ చేసే ఈ బంగారం నిల్వలు.
ఇక్కడ బంగారం పాత్ర ఎందుకు ఉంది? అనే ప్రశ్నకు జవాబు సులువు. దానికి కారణం, మానవ చరిత్రలో వేలాది సంవత్సరాల నుంచి బంగారాన్ని అత్యంత విలువైన, మారకంగా ప్రపంచం చూసింది. అలాగే, ఈ బంగారాన్ని అపరిమితంగా.. అంటే కాగితం కరెన్సీలాగా ‘ముద్రించడం’ సాధ్యం కాదు.! అంటే, బంగారం సరఫరా పరిమితులకు లోబడినది. కాబట్టి, దాని సరఫరా… కాగితం కరెన్సీలాగా అపరిమితంగా జరిగి, అది విలువను కోల్పోయే ప్రమాదం లేదు. కాబట్టి నికరమైన, నమ్మకమైన విలువను కలిగి ఉండే బంగారంతో అటువంటి అవకాశం లేని కాగితం కరెన్సీని ముడిపెట్టవలసి వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా డాలర్‌ను బంగారంతో ముడిపెట్టి ఆ డాలర్‌ను అంతర్జాతీయ లావాదేవీల మధ్యవర్తిగా, మారకంగా నిలబెట్టి దానికి అటు తర్వాత, ప్రపంచంలోని ఇతరేతర దేశాల కరెన్సీలతో ముడిపెట్టారు. అంటే, 35 డాలర్ల విలువ ఒక ఔన్స్ బంగారంతో సమానం. కాగా, ప్రపంచంలోని వివిధ దేశాల కరెన్సీల విలువలు డాలర్‌తో పోలిస్తే, ఎన్ని యూనిట్లు(ఉదాహరణకు భారతదేశం తాలూకు 88 రూపాయలు ఒక డాలర్‌తో సమానం అనే లింక్) అనేది నిర్ణయించారు. ఈ విధంగా 1944లో డాలర్ కేంద్రంగా సరికొత్త అంతర్జాతీయ ఆర్థిక ఫైనాన్స్ వ్యవస్థ ప్రయాణం మొదలయ్యింది.
1944 – 1971 ఆగస్టు 15 అలా, 1944లో అంతర్జాతీయ రిజర్వ్డ్ కరెన్సీగా ప్రారంభమైన అమెరికా డాలర్ సుమారు మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ మూడు దశాబ్దాలలో అనేకానేక మార్పులు, పరిణామాలు జరిగాయి. అంతిమంగా 1971 ఆగస్టు 15వ తేదీన నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారంతో డాలర్‌కు ఉన్న ముడిని తిరస్కరిస్తూ, ఇకముందు కాలంలో తమ ఫెడరల్ బ్యాంక్ వద్ద డాలర్లను బంగారంలోకి మార్చుకోవడం కుదరదంటూ తేల్చి చెప్పేశారు. దాంతో బంగారం, డాలర్ లింక్ తెగిపోయింది. దీనికి కారణాలు అనేకం.
1944 – 1971 మధ్యకాలంలో, ప్రపంచదేశాల మధ్య వాణిజ్యం భారీస్థాయిలో విస్తరించింది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఆర్థిక వినాశనం పాలైన దేశాలు తిరిగి కోలుకోవడం, మరింత వేగంగా ఆర్థిక పురోగతిని సాధించడంతో ఈ వాణిజ్య విస్తరణ జరిగింది. ఈ క్రమంలోనే, ప్రపంచంలోని దేశాలకు తమ తమ అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం డాలర్ల అవసరం భారీగా పెరిగింది. ఫలితంగా అమెరికా పెద్దస్థాయిలో డాలర్ల ముద్రణను చేపట్టవలసి వచ్చింది. అయితే ఇలా డాలర్లు ముద్రించిన ప్రతి సందర్భంలోనూ అమెరికా తన ఖజానాలో ప్రతీ 35 డాలర్ల ముద్రణకూ ప్రతిగా, ఒక ఔన్స్ బంగారాన్ని కొని నిలువ పెట్టవలసిన అవసరం ఉంది. డాలర్‌తో బంగారం ముడిని కొనసాగించడంలో అమెరికాకు ఇక్కడే సమస్య మొదలయ్యింది. బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థ ప్రకారం 35 డాలర్లను 31.103 గ్రాముల బంగారంతో ముడిపెట్టారు. అంటే, ఈ వ్యవస్థలో 31.103 గ్రాముల బంగారం ధర 35 డాలర్ల వద్ద స్థిరపరచబడింది. అయితే, బహిరంగ మార్కెట్లో పరిస్థితి ఇలా స్థిరంగా ఉండదు. ఆ మార్కెట్లో బంగారం ధర నిరంతరంగా మారుతూ ఉంటుంది. ఎక్కువ సందర్భాలలో ఆ ధర పెరుగుతూనే ఉంటుంది.
కాబట్టి, 1944 అనంతరం, కాలక్రమేణా బంగారం ధర పెరుగుతూనే పోయింది. దీంతో భారీగా అంతర్జాతీయ వాణిజ్యం జరిపి పెద్దస్థాయిలో డాలర్లను సముపార్జించిన దేశాలు ఆ డాలర్లను, అమెరికా ఫెడరల్ బ్యాంకుకు ఇచ్చి తమకు ఆ మేరకు బంగారాన్ని ఇవ్వవలసిందిగా డిమాండ్ చేయసాగాయి. ఇది ఆయా దేశాలకు లాభసాటిగా మారింది. బహిరంగ మార్కెట్లో కంటే, అమెరికా ఫెడరల్ బ్యాంకు వద్ద తక్కువ ఖరీదుకు ఆ దేశాలకు బంగారం లభించసాగింది. ఇదంతా అమెరికాకు తలనొప్పిగా మారింది. అదనపు డాలర్లను ముద్రించడం కోసం ఎక్కువ ఖరీదుపెట్టి బంగారాన్ని కొనడం, డాలర్ ముడి వల్ల ఆ బంగారాన్ని, కొన్న ధర కంటే తక్కువకు (బ్రెట్టన్‌వుడ్స్ బంగారం ఒప్పందం ప్రకారం) ఇతర దేశాలకు ఇవ్వవలసి రావడం, అమెరికాకు తీవ్ర సమస్యగా మారింది. అలాగే, అమెరికాకు తాను చేసిన – కొరియా, వియత్నాం యుద్ధాల వలన కూడా భారీఎత్తున డాలర్ల ముద్రణ అవసరం అయ్యింది. ఫలితంగా కూడా అది పెద్దస్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసి నిలువ పెట్టవలసి వచ్చింది. అదీ విషయం.
ఈ విధంగా బ్రెట్టన్‌వుడ్స్ తాలూకు బంగారం డాలర్ వ్యవస్థను నిర్వహించగలగడం అమెరికాకు తలకుమించిన భారం అయ్యింది. ఆ కారణంగానే, అంతిమంగా 1971, ఆగస్టు 15న డాలర్-బంగారం ముడి ఇక కొనసాగదంటూ, నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తేల్చిచెప్పేశారు. ఇక ఆ తరువాతి నుంచి డాలర్ ఫ్లోటింగ్ లేదా ఫియట్ కరెన్సీగా ఏర్పడింది. అంటే, అప్పటి నుంచి డాలర్ విలువను నిర్ణయించేది, మార్కెట్లో దానికున్న డిమాండ్ మాత్రమే.
ఈ స్థితిలో, డాలర్ అంతర్జాతీయ ఆధిపత్యాన్ని, దాని రిజర్వ్ కరెన్సీ స్థానాన్ని కాపాడుకోవడం అమెరికాకు మరింత కష్టమైంది. ఫలితంగా నాడు అమెరికా వ్యూహాత్మకంగా మధ్యప్రాచ్య చమురు ఉత్పత్తి దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. దాని ప్రకారం ఆ దేశాలు తమ ముడిచమురు అమ్మకాలను డాలర్లలో మాత్రమే చేసేందుకు అంగీకరించాయి. దీనికి ప్రతిగా, సౌదీ అరేబియా వంటి దేశాలకు అమెరికా సైనికరక్షణ కల్పిస్తుంది. అత్యాధునిక ఆయుధాలను అందిస్తుంది. కాగా ఇక్కడ గమనించవలసిందేమటంటే, నాడు ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలు మధ్యప్రాచ్యం నుంచే చమురును కొనుగోలు చేయవలసి వచ్చేది. కాబట్టి, ఈ దేశాలు అన్నీ తమ చమురు కొనుగోలు కోసం డాలర్లను కలిగి ఉండటం తప్పనిసరి అయ్యింది. బంగారం-డాలర్ లింక్‌ను నిక్సన్ తెగ్గొట్టిన తర్వాత ఈ విధంగా డాలర్ తిరిగి తన అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.
కాగా, డాలర్‌కు బంగారంతో ముడి ఉన్న దశలో ఇతరేతర దేశాల కరెన్సీలతో దాని మారకం విలువను కేంద్ర బ్యాంకులు నిర్దిష్టంగా (ఫిక్స్ లేదా పెగ్డ్ నిర్ణయించునేవి. అంటే ఉదాహరణకు అమెరికాకు చెందిన ఒక డాలర్‌తో పోలిస్తే భారతదేశ రూపాయలు 8 లేదా 10 లేదా 15… ఇలా ఏదో ఒక నిర్దిష్ట విలువ దగ్గర ఖరారు చేసుకునేవారు. తదనంతర కాలంలో ఆ రెండు దేశాల ఆర్థిక స్థితిగతుల వంటి విషయాలలో జరిగే మార్పుల మేరకు అవసరాన్ని బట్టి మరలా ఆ రెండు దేశాల కరెన్సీల మారకం విలువను మార్పు చేసుకుంటూ, కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేవి. అయితే బంగారంతో డాలర్ లింక్ తెగిపోయిన తర్వాత వివిధ దేశాల కరెన్సీల మధ్య మారకం విలువను నిర్ణయించుకునే విధానం మారసాగింది.
పైన పేర్కొన్న నిర్దిష్ట మారకం విలువల పద్ధతి స్థానే మార్కెట్ ఆధారిత లేదా ఒక కరెన్సీకి ఉన్న డిమాండ్ ఆధారితంగా ఆ కరెన్సీ మారకం విలువను ఏర్పరుచుకునే పద్ధతి వచ్చింది. ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ అవసరం. భారతదేశ కరెన్సీ అయిన రూపాయికి డాలర్ మారకం ఎలా ఉంటుందనేది డాలర్‌తో పోలిస్తే రూపాయికి ఉన్న డిమాండ్ అనేది నిర్ణయించడం ప్రస్తుత పద్ధతి. అంటే, కరెన్సీల విలువలు కూడా, వివిధ సరుకుల విలువల లాగే నిర్ణయించబడుతున్నాయి.
వాటి వాటి డిమాండ్‌పై ఆధారపడి దీనిని సులువుగా అర్థం చేసుకునేందుకు ఇక్కడో ఉదాహరణ చూద్దాం. భారత షేర్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయి. కాగా, ఆ పెట్టుబడులు ఆయా దేశాల తాలూకు కరెన్సీల రూపంలో దేశంలోకి వస్తాయి. అయితే, భారత షేర్ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇతర దేశాల పెట్టుబడిదారులకు రూపాయి కరెన్సీ కావాలి. కాబట్టి, విదేశాల నుంచి మన దేశ షేర్ మార్కెట్లోకి వచ్చే ఇతరేతర కరెన్సీల రూపంలోని పెట్టుబడులను ఆ మదుపుదారులు, మన దేశీయ బ్యాంకులలో రూపాయలుగా మార్చుకోవాలి. అదీ విషయం. అంటే ఇక్కడ మన షేర్ మార్కెట్ గనుక ఎదుగుదల దశలో ఉంటే, దానిలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులను, ఆయా మదుపుదారులు రూపాయలుగా మార్చుకుంటారు. అంటే, ఇక్కడ రూపాయి కరెన్సీకి డిమాండ్ పెరిగిందన్నమాట. మరో పక్కన, ఆ మదుపుదారు ఏ కరెన్సీని అయితే దేశీయ షేర్ మార్కెట్లోకి తెచ్చాడో దానిని అతను అమ్మేస్తున్నాడు. అంటే, ఆ కరెన్సీకి ఆ మేరకు డిమాండ్ తగ్గుతోంది. ఫలితంగా, ఆ విదేశీ కరెన్సీ మారకం విలువ రూపాయితో పోలిస్తే తగ్గిపోతుంది.
డాలర్ మారకం నుంచి ప్రపంచ దేశాలు ఎందుకు, ఎలా దూరమవుతున్నాయో రేపటి సంచికలో చూద్దాం!
1944లో అంతర్జాతీయ రిజర్వ్డ్ కరెన్సీగా ప్రారంభమైన అమెరికా డాలర్ సుమారు మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ మూడు
దశాబ్దాలలో, అనేకానేక మార్పులు, పరిణామాలు జరిగాయి. అంతిమంగా 1971, ఆగస్టు 15వ తేదీన నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారంతో డాలర్‌కు ఉన్న ముడిని తిరస్కరిస్తూ, ఇకముందు కాలంలో తమ ఫెడరల్ బ్యాంక్ వద్ద డాలర్లను బంగారంలోకి మార్చుకోవడం
కుదరదంటూ తేల్చి చెప్పేశారు. దాంతో బంగారం, డాలర్ లింక్ తెగిపోయింది. దీనికి కారణాలు అనేకం.
-డి.పాపారావు
98661 79615