హైదరాబాద్, ఫిబ్రవరి 25: హైదరాబాద్‌లో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్స్. రూ.350 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ హోటల్ కోసం చాలెట్ హోటల్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మైండ్‌స్పేస్ మాదాపూర్ క్యాంపస్‌లో 5.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన హోటల్‌ను నెలకొల్పుతున్నది.
ఈ హోటల్ 2027-28 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి పూర్తికాగలదని ఆశిస్తున్నట్టు కే రహేజా కార్ప్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, ఎండీ రమేశ్ నాయర్ తెలిపారు. 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నెలకొల్పింది రహేజా మైండ్‌స్పేస్. దీంతో ప్రధానంగా ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు తమ కార్యాలయాలను నెలకొల్పాయి . అలాగే వెస్టిన్ బ్రాండెడ్ హోటల్స్, ఇనార్బిట్ మాల్ కూడా ఉన్నది. రీట్స్నకు హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నైలో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తంగా 3.9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇచ్చింది.