కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 28 : భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ఎంతోమంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలని రక్తతర్పణం చేశారని, వారిని స్మరిస్తూ నవంబర్ 1 నుండి 9వ తేదీ వరకు సంతాప సభలు గ్రామ గ్రామాన జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో కరపత్రాలు ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విప్లవోద్యమంలో పేద, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతోమంది తమ ఉన్నతమైన చదువులని, కుటుంబాలని, ఉద్యోగాలను వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేశారని, ఈ క్రమంలోనే గోదావరి పరిహాహక ప్రాంతంలో లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచి, హక్కు కల్పించారని గుర్తు చేశారు.
ఈ విప్లవ ఉద్యమంలో 10 వేల మంది అమరులయ్యారని తెలిపారు. నూతన అటవీ సంరక్షణ నియమాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదివాసులను అడవుల నుండి గెంటివేయడం కోసం పోలీసు బలగాలను, సైన్యాన్ని దింపి దాడులు చేపిస్తుందని ఆరోపించారు. ఆదివాసీలపై మారణహోమాన్ని ఆపాలని, శాంతియుతంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఈ దేశ పౌరులుగా ఉన్న మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. అమరులను స్మరిస్తూ స్తూపాల దగ్గర జెండాలు ఎగరేసి సంతాపం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కల్తి వెంకటేశ్వర్లు, నాయకులు మనోజ్, సాగర్, జీవన్, వరుణ్, రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు.