KRMB |హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నది. టెలిమెట్రీల నిర్వహణ బాధ్యతలను రాష్ర్టాలే తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బోర్డు లేఖ రాసింది.
ప్రతి నీటి సంవత్సరంలో అంటే జూన్ నుంచి మే 31 తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తూ వస్తున్నది. బోర్డు మెంబర్ సెక్రటరీ, రెండు రాష్ర్టాల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లతో కూడిన ఈ కమిటీ ప్రతి ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. రాష్ర్టాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటి వాటాలను కేటాయిస్తున్నది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తున్నది. కానీ, ఈ ఏడాది ఇప్పటివరకూ రివర్ బోర్డు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కానీ, ఏపీ మాత్రం జూలై నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల మళ్లింపును యథేచ్ఛగా చేపడుతున్నది.
ఏపీ ఇప్పటికే 690 టీఎంసీల జలాలను తరలించింది. తెలంగాణ 175 టీఎంసీలను వినియోగించుకున్నది. ఇప్పటికీ ఏపీ నిరంతరాయంగా కృష్ణా జలాలను తరలిస్తున్నది. ఇదిలా ఉంటే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, నీటి మళ్లింపును నియంత్రించకుండా పరోక్షంగా ఏపీ సర్కార్కే కేఆర్ఎంబీ వత్తాసు పలుకుతున్నది. ఏపీ ఇప్పటివరకు 690 టీఎంసీలను వినియోగించుకోగా, బోర్డు మాత్రం 555 టీఎంసీలకు మించి ఏపీ వాడుకోలేదని లెక్కలు చెప్పడం గమనార్హం. తాజాగా నీటిలెక్కల నమోదు బాధ్యత రాష్ర్టాలదేనంటూ బోర్డు చేతులు ఎత్తేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం.. బోర్డుకు కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను నియంత్రించే అధికారం మాత్రమే ఉన్నదని పేరొన్నది. వాటర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, నీటి లెకలు తీయడం రాష్ట్రాల బాధ్యతేనని స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఇచ్చే డాటాతో బోర్డు కేవలం ఒక రెగ్యులేటర్‌గా మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. అదే సమయంలో బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉండటం, ఇంకా ఎటూ తేలకపోవడంతో నేరుగా నియంత్రించలేమని స్పష్టంచేసింది. ఫేజ్-1లో ఇప్పటికే 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశారని, కానీ అవి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదని, మాన్యువల్‌గా డాటా అందిస్తున్నారని గుర్తుచేసింది. ఆ టెలిమెట్రీల నిర్వహణ, రిపేర్లు, డాటా సేకరణ మొత్తం రాష్ట్రాల బాధ్యతేనని బోర్డు ఆ లేఖలో స్పష్టం చేసింది.
యాసంగి సాగు, తాగునీటి అవసరాలకు 73 టీఎంసీలు అవసరమని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నీటి సంవత్సరం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో కృష్ణా జలాలను మళ్లించుకుపోయింది. తాత్కాలిక కోటా 511 టీఎంసీలు కాగా, అంతకుమించి దాదాపు 690 టీఎంసీలను తరలించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ ఏపీకి బోర్డు లేఖ రాసింది. దీనిపై తాజాగా ఏపీ స్పందించింది. ఏపీ వినియోగించుకున్న 690 టీఎంసీల జలాల్లో 215 టీఎంసీలను మినహాయించాలని కోరింది. వరదల సమయంలోనే ఆ జలాలను మళ్లించినట్టు పేర్కొన్నది. ఇదిలా ఉంటే వేసవి తాగునీటి, సాగు నీటి అవసరాలకు ప్రస్తుతం 73 టీఎంసీలు అవసరమని తెలిపింది.