హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన అనర్హత వేటు పిటిషన్‌పై స్పీకర్ విచారణ పూర్తయింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు చెప్పిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. గురువారం చివరి క్రతువును పూర్తి చేశారు.
మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా, గురువారం తుది వాదనలను స్పీకర్ నమోదు చేశారు. తీర్పును రిజర్వ్ చేశారు. ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వాదనలు వినిపించడానికి ఆయన తరఫు లాయర్లు విచారణకు హాజరయ్యారు. దానం విచారణను స్పీకర్ శనివారానికి వాయిదా వేసినట్టు తెలిసింది.