విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్) నిబంధనలను సవరించింది. గతంలో గుట్టు చప్పుడు కాకుండా పెన్షన్‌లో ఎలాంటి పెరుగుదల ఉండకుండా ఫైనాన్స్ బిల్లు- 2025 ద్వారా పలు సవరణ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాజాగా భవిష్యనిధి సంస్థ ద్వారా ఇచ్చే పెన్షన్‌కు ఎసరు పెట్టింది. పెన్షన్ ఇచ్చే బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది.
భవిష్యనిధి సంస్థ ఇటీవల 13 రకాలుగా ఉన్న ఉపసంహరణ నిబంధనలను సరళీకరించింది. అత్యవసర (అనారోగ్యం, విద్య, వివాహం), ఇంటికి సంబంధించిన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు భాగాలుగా విభజించింది. పిల్లల విద్య అవసరాల కోసం 10 సార్లు, వివాహ అవసరాలకు ఐదుసార్లు పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది. కొత్త నియమాల ప్రకారం భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణ వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో నిధులు పూర్తిగా హరించుకుపోకుండా ఉండేందుకు కనీస నిల్వను ప్రతిపాదించారు. అట్లాగే పాక్షిక ఉపసంహరణకు కనీస సర్వీస్ కాలం 12 నెలలకు తగ్గించారు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల కింద ఉపసంహరణ కోసం చందాదారులు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
చిరుద్యోగులకు ఆర్థిక అవసరాలు ఎక్కువ. వారు తమకు తెలియకుండానే పొదుపు చేసేది భవిష్యనిధి సంస్థ ద్వారానే! అది కాస్త కరిగిపోతే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సంక్షేమ పథకాల నుంచి క్రమంగా వైదొలుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భవిష్యనిధిని కూడా వదిలించుకోవడానికి సిద్ధపడింది. కార్మికులు ఉద్యోగుల ఈపీఎఫ్ ఉపసంహరణ 100 శాతం చేసుకోవచ్చనే ఒక వెసులుబాటు ద్వారా వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. సభ్యుల పొదుపు మొత్తాలు పూర్తిగా ఉపసంహరించుకునే క్రమంలో ఇకపై భవిష్యనిధి సంస్థ అవసరం ఉండదు. ఇందుకోసమే తాజాగా నిబంధనలు సడలించింది. కార్మికులను, ప్రైవేటు ఉద్యోగులను ఉద్ధరించబోతున్నట్టుగా ప్రభుత్వం పైకి చెప్తున్నది. కానీ, ఈపీఎఫ్ ఖాతాల్లో అసలు డబ్బే లేకుండా ఖాళీ చేస్తే పదవీ విరమణ తర్వాత వారికి పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే పెన్షన్ ఇచ్చే బాధ్యతల నుంచి ప్రభుత్వం ఈ రకంగా తప్పుకోవడమే దీని వెనుక దాగి ఉన్న అసలు కుట్ర! ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నిర్ణయాల వల్ల కొందరికి మేలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ, చాలామంది భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
2004లో వాజపేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ను రద్దుచేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ముందుకుతెచ్చింది. ఆ విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ కొనసాగించింది. ఇప్పుడు ఉద్యోగుల వ్యతిరేకత తీవ్రమైన నేపథ్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కొద్ది మార్పులతో ఏకీకృత పెన్షన్ విధానం (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)ను కూడా తెచ్చింది. మొత్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఏకీకృత పెన్షన్ విధానం కూడా ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు కార్మికులకు భవిష్యనిధి సంస్థ ద్వారా కనీస గ్యారెంటీ ఇచ్చే పెన్షన్‌ను రద్దు చేసే చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే తాజాగా 100 శాతం ఉపసంహరణ కోసం కేంద్రం నిబంధనలను సడలిస్తున్నది. భవిష్యనిధి నిల్వలపై వడ్డీ భారాన్ని ఎగ్గొట్టేందుకు చేసిన ఈ నిబంధనల సడలింపుతో ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత లేకుండాపోతుంది.
ఉపసంహరణ కోసం సభ్యులకు అవకాశాలు కల్పిస్తున్నామనే నెపంతో విమర్శలు రాకుండా, ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉచిత సలహా కూడా ఉద్యోగులకు భవిష్యనిధి సంస్థ ఇస్తున్నది. ఈ విషయంలో సంస్థ కంటే చందాదారులే ఎక్కువ విజ్ఞత, వివేకం ప్రదర్శించాలని కూడా నీతులు చెప్తున్నది.
ప్రభుత్వ ఖజానాకు భారమవుతున్నదనే నెపంతో ఉద్యోగులు, కార్మికుల పెన్షన్లను కత్తిరించడానికి గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెచ్చింది.
పెన్షన్‌లో ఎలాంటి పెరుగుదల ఉండకుండా ఫైనాన్స్ బిల్లు- 2025 ద్వారా గుట్టు చప్పుడు కాకుండా మరో సవరణ కూడా చేసింది. ఇప్పుడు భవిష్యనిధి సంస్థ ద్వారా ఇచ్చే పెన్షన్‌కు ఎసరు పెట్టింది. కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేసి, అనేక రాయితీలను కల్పిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకు ఇచ్చే ఆర్థిక చేయూతను నిర్వీర్యం చేస్తున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలి. తద్వారా శ్రమజీవుల భవితకు భరోసాగా ఉన్న, పదవీ విరమణ తర్వాత చివరి దశలో ఆత్మగౌరవంతో బతికేందుకు ఆధారమైన పెన్షన్‌ను కాపాడుకోవాలి.
– (వ్యాసకర్త: విద్యారంగ విశ్లేషకులు)
కె.వేణుగోపాల్ 98665 14577