Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీని వణికిస్తున్నది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను మంగళవారం రాత్రి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం నుంచి నడవాల్సిన 32 విమానాలను అధికారులు మంగళవారం రద్దు చేశారు. అక్టోబర్ 27న రెండు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు చేసినట్లు విశాఖపట్నం విమానాశ్రయ డైరెక్టర్ ఎన్ పురుషోత్తమన్ తెలిపారు.
ప్రాథమికంగా రోజుకు 30 నుంచి 32 వరకు దేశీయ అంతర్జాతీయ విమానాలను నడుస్తాయని.. వాటన్నింటిని నేడు రద్దు చేశామని తెలిపారు. తుపానుకు ముందు తర్వాత దశల్లో ఏఏఐ మార్గదర్శకాల ప్రకారం.. విమానాశ్రయం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో 16 విమానాలు రద్దు కాగా.. ఐదింటిని నడిపించారు. విమానాశ్రయ పరిపాలన వివరాల ప్రకారం.. మంగళవారం కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. బుధవారం కార్యకలాపాలకు సంబంధించి సాయంత్రానికి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అలాగే, తిరుపతి విమానాశ్రయంలోనూ నాలుగు విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సైతం భారీగా రైళ్లు రద్దు చేసింది. దాదాపు 120 వరకు రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే అధికారి ఒకరు వివరించారు.