మనిషి నడిచేది మట్టిపైనే.. మనిషి నిలిచేది మట్టిపైనే… మనిషి పోయాక ఆయన మీద కప్పేది మట్టినే. మట్టితో మనిషి బంధం ఎనలేనిది. ఇలా… పుట్టినప్పటి నుంచి గిట్టేదాన్క మట్టితో మనిషిది విడదీయరాని బంధం.. అలాంటి మట్టిని కాపాడుకోవడం మనుష్యులుగా మన బాధ్యత.
నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం. ఒక ఆరోగ్యకరమైన నేలను భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో మట్టి వనరుల సుస్థిరమైన నిర్వహణ కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చైతన్యాన్ని, అవగాహనను తీసుకురావడానికి ఒక సాధనంగా ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకోవాలని 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ (ఐయూఎస్ఎస్) సిఫారసు చేసింది. థాయ్‌లాండ్, గ్లోబల్ సాయి ల్ పార్టనర్షిప్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎఫ్ఏవో ప్రపంచవ్యాప్తంగా మృత్తిక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు మద్దతు ఇచ్చింది.
2013 జూన్‌లో ఎఫ్ఏవో కాన్ఫరెన్స్ ప్రపంచ నేల దినోత్సవాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, 68వ ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీలో దీన్ని అధికారికంగా స్వీకరించాలని అభ్యర్థించింది. 2013 డిసెంబర్లో యూఎన్ జనరల్ అసెంబ్లీ మొదటి అధికారిక ప్రపంచ మృత్తిక దినోత్సవంగా 2014 డిసెంబర్ 5ను గుర్తించింది. అప్పటినుంచి ఏటాడిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకొంటున్నారు.
మనిషి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో నేల లేదా మృత్తికలు ముఖ్యమైనవి. మనిషికే కాదు, సకల జీవరాశులు, సూక్ష్మజీవులు సహా అన్నింటికీ ఆధారం ఈ మృత్తికలే. భూ ఉపరితలంలోని సారవంతమైన సన్నటి పొరనే నేల లేదా మృత్తిక అంటారు. భూమిపై ఉన్న రాళ్లు శిథిలం చెందడం, జంతు వృక్ష సంబంధిత పదార్థాలు కాలక్రమేణా అనేక భౌతిక రసాయనిక మార్పులకు లోనుకావడం వల్ల నేలలు ఏర్పడ్డాయి. ఒక సెంటీమీటరు మందం ఉన్న మృత్తిక ఏర్పడటానికి ఐదు నుంచి పది వేల ఏండ్ల వరకు పడుతుంది.
మృత్తికలు మనిషి జీవితంతో విడదీయరాని బంధా న్ని ఏర్పర్చుకున్నాయి. మనుష్యులు వ్యవసాయం చేయడం ప్రారంభించినప్పుడు నదీపరీవాహక ప్రాంతాల్లోని సారవంతమైన నేలల వైపు మొగ్గుచూపారు. అం దుకే గొప్ప గొప్ప నాగరికతలు మంచి సారవంతమైన నేలలున్న ప్రాంతాల్లోనే విలసిల్లాయి.
మన దేశంలోని మృత్తికలు: ఒండ్రుమట్టి నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నలుపు-ఎర్ర మిశ్రమ నేల లు, లాటరైట్ నేలలు, ఎడారి నేలలు, అటవీ నేలలు, క్షార లేదా ఆమ్ల నేలలు అనే ఎనిమిది రకాల నేలలను ఇప్పటివరకు గుర్తించారు. ఈ నేల రకాలే ఒక ప్రాంతంలో పండే పంటలను నిర్ణయిస్తాయి. తెలంగా ణ విషయానికి వస్తే అత్యంత ఫలవంతమైన ఒండ్రు నేలల నుంచి నిరుపయోగమైన ఇసుక నేలల వరకు రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో 48 శాతం ఎర్ర నేలలు, 25 శాతం నల్లరేగడి నేలలు, 20 శాతం ఒం డ్రు నేలలుండగా.. మిగిలినవి లాటరైట్ నేలలు. అయి తే ఈ సారవంతమైన నేలలు మనిషి చర్యల వల్ల నాశనమవుతున్నాయి. విచక్షణారహితంగా రసాయని క ఎరువుల వాడకం వల్ల నేలలు తమ సహజ జవసత్వాలను కోల్పోయి నిస్సారం అవుతున్నాయి.
అంతేకాకుండా నదులు, వర్షాలు, వరదలు, గాలి లాంటి సహజ కారణాల వల్ల మెత్తని, సారవంతమైన నేలలు కొట్టుకుపోయి క్రమక్షయానికి గురవుతున్నాయి. మనదేశంలో సుమారు 175 మిలియన్ హెక్టార్లలో జరిగే ఈ క్రమక్షయం వల్ల ప్రతి సంవత్సరం 6,000 మిలియన్ టన్నుల సారవంతమైన నేలలు కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల ఏటా 30 నుంచి 50 మిలియన్ టన్నుల పంట నష్టం జరుగుతున్నది. దీంతోపాటు కొట్టుకుపోయిన ఈ మట్టి అంతా జలాశయాల్లో పూడికగా చేరి వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని 2 శాతం వరకు తగ్గిస్తున్నాయి. ఇలా జలాశయాల్లో పూడిక చేరడం వల్ల వరదల సంఖ్య కూడా పెరుగుతున్నది.
మృత్తిక సంరక్షణకు ప్రభుత్వాల కృషి: మృత్తిక సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నది. కాంటార్ బండింగ్, సోపాన వ్యవసాయం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తున్నది. నేలల క్రమక్షయా న్ని తగ్గించడానికి మల్చింగ్, స్ట్రిప్ క్రాపింగ్ వంటి పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిన రొట్టను (పంట వ్యర్థాలు) పొలంలోనే దున్నడం ద్వారా నేలల సారాన్ని పెంచవచ్చు. మల్చింగ్ పద్ధతిలో రొట్టను పొలంలో పరిచి, పవనాల వల్ల నేలల క్రమక్షయాన్ని అరికట్టవచ్చు. స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతిలో వివిధ కాల వ్యవధుల్లో కోతకు వచ్చే పంటలను వరుసల్లో పెంచుతారు. చంబల్-యమునా లోయ ప్రాంతంలో నేలల తీవ్ర క్రమక్షయం వల్ల గల్లీలు, రావైన్‌లు ఏర్పడి ఆ ప్రాంతమంతా ‘బ్యాడ్‌ల్యాండ్’ భూ స్వరూపాన్ని సంతరించుకున్నది.
ఈ ప్రాంతంలో భూ వనరులను పునరుద్ధరించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తున్నది. పంటల మార్పిడి పద్ధతి ద్వారా కూడా నేలల సారం పెంచవచ్చు. లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను మార్పిడి పంటగా వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఆక్సిజన్ లభ్యత పెరి గింది. చెట్ల సంఖ్య పెరగడం వల్ల నేల కోతకు గురికాకుండా అడ్డుకట్ట పడింది.
మట్టి లేకుండా.. హైడ్రోపోనిక్స్ వంటి సాంకేతికతను వినియోగించి పంటలు పండించవచ్చు. కానీ మానవజాతికే కాకుండా చరాచర జీవులన్నింటికీ జీవాధారమైన నేలను నాశనం చేసినవారమవుతాం. ఆ హక్కు మనకు లేదు. మనకు మెతుకును, బతుకుని స్తున్న నేలను భవిష్యత్ తరాలకు నాశనం చేయకుండా ఇవ్వగలిగినప్పుడే ఆ తరాలు మనల్ని క్షమిస్తాయి. లేదంటే భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసిన వాళ్లుగా చరిత్రలో మిగిలిపోతాం.
(వ్యాసకర్త: అధ్యాపకుడు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ )
డాక్టర్ బి.దీపక్‌రెడ్డి
89193 96452