Jaggery | బెల్లంను మనం తరచూ అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తాం. బెల్లంతో తీపి వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది ఉపయోగించే ఆహార పదార్థాల్లో బెల్లం కూడా ఒకటి. ఆసియా దేశాలకు చెందిన వారు బెల్లాన్ని ఎక్కువగా తింటారు. అయితే ఆయుర్వేద ప్రకారం బెల్లం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. బెల్లాన్ని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే చలికాలంలో రోజూ కచ్చితంగా చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి పూట భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను తినాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని, చలికాలంలో మనకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.
ఆయుర్వేద ప్రకారం బెల్లం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీనికి వేడి చేసే గుణం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కనుక చల్లని వాతావరణంలో లేదా చలికాలంలో బెల్లాన్ని తింటుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇక బెల్లం భిన్నమైన స్వరూపాన్ని కలిగి ఉంటుంది. ఇది చక్కెరతో పోలిస్తే పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. బెల్లంలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. శరీరానికి నిరంతరం శక్తిని అందిస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. చలికాలంలో సహజంగానే ఉండే బద్దకం నుంచి బయట పడవచ్చు. యాక్టివ్‌గా పనిచేయగులుగుతారు.
బెల్లాన్ని సహజసిద్ధమైన క్లీనింగ్ పదార్థంగా ఉపయోగిస్తారు. సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా ఉండేందుకు గాను రోజూ బెల్లం తినమని ఇస్తారు. ఈ క్రమంలోనే బెల్లాన్ని తినడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం, దుమ్ము, ధూళి, పొగ వంటివి తొలగిపోతాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసనాళాలు సైతం శుభ్రంగా ఉంటాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. గొంతు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ సైతం తగ్గుతుంది. బెల్లాన్ని అల్లం లేదా మిరియాల పొడితో కలిపి తింటుంటే ఇంకా ఎంతగానో మేలు జరుగుతుంది. శ్వాసకోశ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే రక్తహీనత కారణంగా వచ్చే నీరసం, అలసట సైతం తగ్గిపోతాయి. ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. బెల్లాన్ని తినడం వల్ల మెగ్నిషియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్‌ను పొందవచ్చు. ఇవి మన శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. చలికాలంలో శరీర మెటబాలిజం తగ్గుతుంది. కానీ బెల్లంను తింటే మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీని వల్ల క్యాలరీలు సులభంగా ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇక చలికాలంలో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు బెల్లంను తింటే ఉపయోగం ఉంటుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇలా చలికాలంలో బెల్లంను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.