రంగారెడ్డి: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (Sub Registrar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఓ వైపు ఏసీబీ అధికారులు (ACB Raids) దాడులు జరుపుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికే జిల్లాలోని శంకర్పల్లి, వనస్థలిపురం, గండిపేట, సరూర్‌నగర్ వంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి అధికారులపై వేటు వేశారు. ఈ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌కో ఓ రేట్‌ను ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. దళారులను అడ్డం పెట్టుకుని అధికారులు సాగిస్తున్న అవినీతి దందా రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాగా, జిల్లా లో 17 వరకు సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి.
గండిపేట, శంకర్పల్లి, చేవెళ్ల, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శం షాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, షాద్‌నగర్, వనస్థలిపురం వంటి కార్యాలయాల నుంచి ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నది. ఈ కార్యాలయాల్లో కొందరు అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి లంచం ఇస్తే ఎలాంటి భూములనైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న భూములనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. నగర శివారులోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్ వంటి కార్యాలయాల్లో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను కూడా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటీవల వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ పార్కుస్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో అధికారులు ఆయనపై వేటువేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం అధికంగా ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తున్నది. ప్రతి ఏటా జిల్లా నుంచి సుమారు రూ. 3,000 కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం. కాగా, అధికారులు చేస్తున్న జిమ్మిక్కులతో ఆదాయానికి భారీగా గండి పడుతున్నది.
జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఇటీవల ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే శంకర్పల్లి, వనస్థలిపురం, గండిపేట, సరూర్‌నగర్ సబ్రిజిస్ట్రార్లపై వేటు వేశారు. అయినా ఆ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం మాత్రం ఆగడంలేదు. చేతులు తడపనిదే పనులు జరగని పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రియల్ఎస్టేట్ వ్యాపారులు, డాక్యు మెంట్ రైటర్ల కనుసన్నుల్లో నడుస్తున్నాయి. వీరు ప్రతి ఫైల్‌కు ఇంత మొత్తామని ఫిక్స్ చేసి మరీ వసూలు చేసి అధికారులకు ఇస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరో పణలున్నాయి. సామాన్యులు కార్యాలయాలకెళ్తే పలు కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని.. అదే డాక్యుమెంట్ రైటర్లు, రియల్ఎస్టేట్ వ్యాపారుల ద్వారా వెళ్తే పనులు త్వరగా జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలోని గచ్చిబౌలిలో అత్యంత విలువైన ఓ స్థలాన్ని గచ్చిబౌలి సబ్‌రిజిస్ట్రార్ రియల్ఎస్టేట్ వ్యాపారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు ఎకనామిక్ అఫెన్స్ కింద కేసు నమోదుచేసి విచారణ జరిపి అధికారితోపాటు తప్పుడు జీపీఏ సృష్టించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని సర్వేనంబర్ 91లో 700 చదరపు గజాల భూమిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రమణకుమార్ అనే వ్యక్తి 1987లో కొన్నాడు. ప్రస్తుతం ఈ భూమి విలువ మార్కెట్లో రూ. 14 కోట్లుగా ఉన్నది.
రమణకుమార్ తరచూ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి తన స్థలాన్ని పరిశీలించి వెళ్లేవాడు. ఇటీవల అతడు ఈసీ తీయగా ఆ భూమి శేఖర్‌బాబు పేరిట రికార్డులో కనిపించడంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. విచారించిన పోలీసులు కర్మన్‌ఘాట్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి నకిలీ జీపీఎస్ సృష్టించి తన భూమిని శేఖర్‌బాబుకు విక్రయించినట్లు తెలుసుకున్నాడు. ఈ భూమి ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్నా సబ్‌రిజిస్ట్రార్ నిబంధనలు ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈవోడబ్ల్యూ పోలీసులు రంగంలోకి దిగి సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్, శేఖర్బాబులతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.