కుత్బుల్లాపూర్, మార్చి10: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మా పాఠశాల చుట్టూ చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు వినూత్న ర్యాలీ చేపట్టారు. కొంపల్లి సర్కిల్ పరిధి సాయిబాబానగర్ డివిజన్ సూరారం కాలనీలో జిల్లా పరిషత్ హైస్కూల్ గేటు వద్ద ప్రతిరోజు ఉదయం కొందరు స్థానికులు చెత్తను పారవేస్తున్నారు. ఈ విషయం పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ దృష్టికి రాగా.. ఆయన విద్యార్థులతో కలిసి మంగళవారం స్కూల్ పరిసర ప్రాంతాల్లో డప్పుచప్పుళ్ల మధ్య బ్యానర్లతో నిరసన ర్యాలీ తీశారు. అమ్మలు, అన్నలు.. మీ ఇంట్లో చెత్తను మా పాఠశాల ముందు వేయొద్దు అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ అధికారులు తమ సమస్య పరిష్కరించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.