విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో పోటీ తీసుకురావడానికి, ఓపెన్ యాక్సిస్ విధానాన్ని విస్తృతపరచడానికి, పునరుత్పాదక ఇంధన వృద్ధి లక్ష్యాలను సాధించడానికి అంటూ 2003 నాటి విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 2018లో ప్రజాభిప్రాయం కోసం ముసాయిదా విడుదల చేశారు. 2022లో మరోసారి లోక్సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. తాజాగా మోదీ ప్రభుత్వం బిల్లుపై ప్రజాభిప్రాయం చెప్పాలంటూ అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒకే ప్రాంతంలో పలు పంపిణీ సంస్థలకు అవకాశం ఇవ్వాలని విద్యుత్తు సవరణ బిల్లులో ప్రధానంగా ప్రతిపాదించారు. దీనివల్ల పోటీని ప్రోత్సహిస్తే యూనిట్ చార్జీలు తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి ప్రైవేటు సంస్థలు లాభాలు వచ్చే ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో విద్యుత్తు నియంత్రణ మండళ్ల (ఈఆర్సీ) అధికారాలు పరిమితమవుతాయి. ఈఆర్సీలు స్వయంప్రతిపత్తిని కోల్పోతాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారతాయి. మోదీ ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్ సంస్కరణలను తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ సంస్కరణల్లో మోదీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నది. అయితే, పునరుత్పాదక సంస్థలన్నింటిని కార్పొరేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలే లేవు. ఈ సంస్కరణల పేరిట క్రమంగా విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు. అయితే, ఇక్కడ మరో కీలక అంశం గురించి చర్చించుకోవాలి. ఈ బిల్లు ఫలితంగా ప్రైవేటు కంపెనీలకు యూనివర్సల్ విద్యుత్ సరఫరా బాధ్యత ఉండదు. లాభదాయకమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే కార్పొరేట్ కంపెనీలు విద్యుత్తు సరఫరా చేస్తాయి. అంతేకాదు, ప్రభుత్వరంగ సంస్థల నెట్వర్క్ను ఉపయోగించుకుంటాయి. దానివల్ల ప్రభుత్వరంగ సంస్థలు దివాలా తీస్తాయి. చివరికి విద్యుత్తు కొనుగోలు చేయడానికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది.
విద్యుత్తు సవరణ చట్టంలోని ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వినియోగదారుల రక్షణ కోసం ఇప్పటివరకు ఉన్న చట్టాలన్నీ రద్దవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ అమల్లో ఉంది. పరిశ్రమలకు అధిక టారిఫ్ విధించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులు, పేద వినియోగదారులకు సబ్సిడీ ద్వారా కరెంటు సరఫరా చేయడాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. వచ్చే ఐదేండ్లలో ఈ విధానాన్ని ఎత్తేయాలని ఈ బిల్లులోని సెక్షన్ 61లో కేంద్రం ప్రతిపాదించింది. క్రాస్ సబ్సిడీని ఎత్తివేస్తే సంపన్నులకు విద్యుత్తు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో సామాన్యులు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాడాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: సీపీఐ ఎంఎల్ నాయకులు)
-ముప్పాళ్ల భార్గవశ్రీ
98481 20105