– గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బానోత్ మధు
జూలూరుపాడు, ఫిబ్రవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం జిల్లా నాయకుడు బానోత్ మధు డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట నేలకూలి పూర్తిగా దెబ్బతిన్నదని, కల్లాలలో ఎండబెట్టిన మిర్చి తడిసిపోవడంతో రైతులకు భారీ నష్టం సంభవించిందని తెలిపారు. అదనంగా పత్తి, వరి తదితర పంటలు కూడా ప్రభావితమైనట్లు చెప్పారు. రైతులు అప్పులపాలై ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అకాల వర్షం మరింత కష్టాల్లోకి నెట్టిందన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో పంట నష్టం అంచనా వేయించి, ప్రతి ఎకరాకు సరిపడ నష్ట పరిహారం ప్రకటించాలన్నారు. అలాగే, పంట బీమా కింద నమోదు చేసిన ప్రతి రైతులకు తక్షణమే బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని, కొత్త రుణాలు వడ్డీ రహితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.