కారేపల్లి, ఫిబ్రవరి 24 : మహిళల పేరుతో అక్రమంగా రుణాలు తీసుకున్న విజేత మండల మహిళా సమాఖ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండెబోయిన ఉమావతి డిమాండ్ చేశారు. మంగళవారం కారేపల్లిలో జరిగిన ఐద్వా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజేత మండల మహిళా సమైక్య సిబ్బంది మొట్లగూడెం, పేరేపల్లి, మాదారం, పోలంపల్లి గ్రామ సమాఖ్యల పరిధిలోని గ్రామాలలోని గ్రూపు సభ్యుల పేరుతో అక్రమంగా సీసీఐఎఫ్, స్త్రీ నిధి రుణాలు తీసుకున్నారన్నారు. రుణాలు మంజూరు చేయించే సందర్భంలో పర్సంటేజీ తీసుకొవడమే కాకుండా ఏకంగా గ్రూపు సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని తామే తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి కొంతకాలం చెల్లించారన్నారు. అక్రమంగా తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు అమాయక గ్రూపు సభ్యులు కట్టాలని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గ్రూపు సభ్యులకు చెందిన పొదుపు ఖాతాలను హోల్డ్‌లో పెట్టడం, జప్తి చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.
అక్రమంగా రుణాలు తీసుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారి నుండి రుణాలను రికవరి చేయాలని డిమాండ్ చేశారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మంజూరులో పారదర్శకత లోపించిందని, డ్వాక్రా మహిళలకు విధివిధానాలను తెలియజేప్పే వారే అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిపై సరైన అజమాయిషి లేకపోవటమే దీనికి కారణమన్నారు. గ్రూపు రుణాలపై సోషల్ ఆడిట్ నిర్వహించి అక్రమాలను వెలికి తీయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత గ్రూపు సభ్యులకు న్యాయం చేయకుంటే అందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐద్వా నేతలు సూరబాక ధనమ్మ, కేశగాని నీలిమ, కరపటి సీతమ్మ, పాయం వరలక్ష్మి, బానోతు సరోజ, ధనమ్మ, వెంకట లక్ష్మి, రమాదేవి, స్వరూప రాణి, పద్మ, కోటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.