రాష్ర్టాభివృద్ధికి విద్య, వైద్యం, నీళ్లు, కరెంటు, రోడ్ల నిర్మాణం గీటురాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఈ రంగాలను పటిష్ఠంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌రంగాన్ని అద్భుతంగా తయారుచేసి 24 గంటల నాణ్యమైన కరెంటును అందించడంలో సఫలమయ్యారు. 2014లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,600 మెగావాట్లుంటే, అది 2021 నాటికి 17,305 మెగావాట్లకు చేరుకున్నది. 2023 చివరినాటికి 25 వేల మెగావాట్లకు పెరుగనున్నది. దేశ విద్యుత్ చరిత్రలో ఇదొక అద్భుతం.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఏర్పాటవుతున్న ‘యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్’ ద్వారా మిగు లు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నది. విద్యుత్‌రంగం పరిపుష్ఠిగా ఉంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. మన రాష్ట్రంలో కరెంటుకు, నీళ్లకు ఢోకా లేదు. కాబ ట్టే, రోజుకో పరిశ్రమ చొప్పున అనేక పరిశ్రమలు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. వరంగల్, కరీంనగర్ ఖమ్మం లాంటి పట్టణాల్లో కూడా ఐటీ హబ్‌లు వెలుస్తున్నాయి. లక్షలాది మంది యువతకు ఈ రంగాల్లో ఉపాధి లభిస్తుండటం అభినందనీయం.
విద్యుత్‌రంగాన్ని తీర్చిదిద్దినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు, తాగు నీరుపై దృష్టి
పెట్టారు. మిషన్ కాకతీయ కింద సుమారు 45 వేల చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం పల్లెల్లో ఏడాది పొడవునా ఈ నీళ్లు కనువిందు చేస్తున్నాయి. తద్వారా రాష్ట్రం లో సాగు కోటి ఎకరాలకు పైగా అందుబాటులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా ఏడు లింకులతో నిర్మితమైన మేడారం రిజర్వాయర్, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్… మొత్తం 16 రిజర్వాయర్లతో లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. ఇంకా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, చనాఖా-కోరాట ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. నీటిపారుదల రంగం విస్తృతం కావడం వల్ల వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. లక్షల టన్నుల్లో ధాన్యపు రాశుల ఉత్పత్తి జరుగుతున్నది. పంజాబ్‌కు ధీటుగా ఈరోజు రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి అవుతున్నది. ఉద్యానపంటలు, ఆయిల్‌పామ్ పెంపకానికి ఆదరణ పెరుగుతున్నది.
విద్యారంగాన్ని పరిశీలిస్తే… హైదరాబాద్ నగరం ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్, మనూ లాంటి పెద్దపెద్ద విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. పలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇటీవల వివిధ ప్రదేశాల్లో ఏర్పాటవడం ముదావహం. దేశంలో మొట్టమొదటి ట్రైబల్ వర్సిటీ ములుగు జిల్లా జాకారంలో ఏర్పాటవుతున్నది. వందలాది గురుకులాలు, మహిళలకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు, మహిళా పాలిటెక్నిక్‌లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంగా కోఠి ఉమెన్స్ కళాశాలను ఉన్నతీకరించింది. ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. దీంతో గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు
వైద్యరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తున్నది. జిల్లాకో మెడికల్ కళాశాల దేశంలోని ఏ ప్రభుత్వమూ ఏర్పాటుచేయలేదు. దీంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. వరంగల్‌లో సూప ర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణమవుతున్నది. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో ఈ దవాఖానలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌కు నలువైపులా చైతన్యపురి, అల్వాల్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌లలో ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ పేరుతో సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ దవాఖానల్లో సుమారు 4,300 పడకలుంటాయి. రేపటి జనాభాకు వైద్య అవసరాలు తీర్చడంలో ఈ దవాఖానలు కీలక భూమిక పోషి స్తాయి.
ప్రభుత్వం పట్టణీకరణ కోసం మెరుగైన రహదారులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 10 జిల్లాలున్న తెలంగాణ నేడు 33 జిల్లాలుగా మారింది. కొత్తగా అనేక మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించబోయే రోడ్లతో పట్టణీకరణ పెరుగుతున్నది. 33 జిల్లాల్లో కలెక్టరేట్ భవనా లు ఏర్పాటయ్యాయి. కాబ ట్టి ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్ కు రెండు లైన్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. అనేక ప్రాంతాలను కలుపుతూ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవుతున్నా యి. కొత్తగా నిర్మిస్తున్న 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)తో అనేక ప్రాం తాలు నగరాలుగా రూపుదిద్దుకుంటాయనడంలో సందేహం లేదు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ద్ధి సాధించిందనేది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతంగానే ఉంటుందనే ఒక నిర్లిప్త భావం ప్రజల్లో ఉండేది. దీన్ని కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలో తుడిచేశారు. నూతనంగా నిర్మితమవుతున్న సచివాలయ భవనం రాష్ర్టానికే తలమానికం. ఇంత టి అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తున్నామో ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. అభివృద్ధిపై రాజకీయాలు కాదు, రాజీలేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని అవగతం చేసుకోవాలి.
-కన్నోజు మనోహరాచారి ,79950 89083