Explosives : హర్యానా (Haryana) లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఢిల్లీలో 13 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పేలుడు (Delhi blast) తో వాటికి లింకు ఉండటం, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఆ పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన పోలీస్‌స్టేషన్ పేలిపోయి 8 మంది పోలీసులు దుర్మరణం పాలు కావడం లాంటి పరిణామాలను మరువకముందే.. తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని దబారా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పాఠశాల సమీపంలోని పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్స్ ఉండటాన్ని గమనించిన ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించగా అందులో ఆ ప్యాకెట్లలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి.
దాంతో డాగ స్క్వాడ్‌ను రప్పించి పొదల్లో తనిఖీ చేయించగా అక్కడికి 20 అడుగుల దూరంలో మరికొన్ని ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిలో కూడా జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయని, వాటి బరువు 20 కిలోలు ఉన్నదని పోలీసులు తెలిపారు. అసలు ఆ జిలెటిన్ స్టిక్స్‌ను గ్రామంలోకి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.