హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం అసాధ్యమని, సాంకేతికంగా, ఆర్థికంగానూ అది సాధ్యం కాదని తాజాగా ఎస్వీ కన్సల్టెన్సీ తేల్చింది. అక్కడి నుంచి 44 టీఎంసీలకు మించి నీళ్లు మళ్లించలేమని నిర్ధారించింది. తమ్మిడిహట్టికి 9 కి.మీ. దిగువన బోరేపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి అనువైనదని, అక్కడి నుంచి జలాలను లిఫ్ట్‌చేసి ఇప్పటికే నిర్మించిన ప్రాణహిత కెనాల్‌కు అనుసంధానించవచ్చని స్పష్టం చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఆ నివేదికను పక్కన పెట్టి తమ్మిడిహట్టి నుంచే జలాలను తరలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రతిపాదించింది. వార్ధా, వెయిన్‌గంగా నదులు కలిసిన తరువాత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద రూ.1,910 కోట్లతో బరాజ్ నిర్మించాలని నిర్ణయించింది.
కానీ, అక్కడ బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అంశాలు సానుకూలంగా లేవని అధికారులు ఆదిలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. బరాజ్‌ను నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాలని, అందుకు విరుద్ధంగా తమ్మిడిహట్టి వద్ద ప్రవాహం 55-71 డిగ్రీల కోణంలో ఉన్నదని గుర్తించారు. అది కూడా కేవలం 45 డిగ్రీల స్క్యూ షేప్‌లో బరాజ్‌ను నిర్మించాల్సి వస్తుందని, అది క్షేమదాయకం కాదని, స్క్యూ షేప్‌లో బరాజ్ నిర్మాణానికి డిజైన్లు ఎక్కడా అందుబాటులో లేవని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొన్నారు. తమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించాలంటే సుమారు 6.5 కి.మీ. మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, 100 నుంచి 110 గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా రూపొందించారు.
మొత్తంగా బరాజ్ భద్రత కోసం అదనపు నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందని, అందుకు రూ.2,500 కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తుందని నాడు లెక్కలు వేయడంతోపాటు మున్ముందు బరాజ్ నిర్వహణ భారంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత తమ్మిడిహట్టి పక్కనే చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండడంతోపాటు దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని, దీంతో భవిష్యత్‌లో సీడబ్ల్యూసీ అనుమతులు పొందేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతాయని తేల్చిచెప్పారు.
ప్రాణహిత కంఫ్ల్యూయెన్స్ పాయింట్‌కు 0.5 కి.మీ. ఎగువన 148 మీటర్ల వద్ద 1.5 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించినప్పటికీ అక్కడి నుంచి 44 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లించలేమని నిర్ధారించారు. ఈ సాంకేతిక ప్రతికూలతల రీత్యా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బరాజ్ నిర్మాణాన్ని వార్ధాపైకి మార్చింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ లోకేషన్ మార్పుపై ఆది నుంచీ సదరు అసత్యాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై బురదజల్లింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాంకేతిక ప్రతికూలతలను విస్మరిస్తూ కేవలం మొండిపట్టుతో తమ్మిడిహట్టి వద్దే బరాజ్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టి, వార్ధా డీపీఆర్‌ను అటకెక్కించింది. గ్రావిటీ ద్వారా 165 టీఎంసీలను తరలించవచ్చంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్.. ఆ తరువాత 80 టీఎంసీలనే తరలించాలని నిర్ణయించింది. అది కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్ నిర్మించిన సుందిళ్ల బరాజ్‌కు జలాలను తరలించేందుకు సిద్ధమైంది.
మిగతా 100 టీఎంసీలను యథావిధిగా మేడిగడ్డ నుంచి తరలించేందుకు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టు ప్రణాళికలు, డీపీఆర్ తయారీ బాధ్యతలను ఇటీవల ఆర్వీ కన్సల్టెన్సీకి అప్పగించడంతోపాటు ఎస్వీ కన్సల్టెన్సీ నివేదికను సైతం అధ్యయనం చేయాలని సూచించింది. కానీ, ఎస్వీ కన్సల్టెన్సీ సిఫారసులను ఆర్వీ కన్సల్టెన్సీ తిరస్కరించినట్టు సమాచారం. బరాజ్ నిర్మించి లిఫ్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ఆర్వీ కన్సల్టెన్సీ తోసిపుచ్చి, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కొత్త అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించింది.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను నిర్మించి 58 కి.మీ. వద్ద నుంచి జైపూర్ మీదుగా జలాలను సుందిళ్లకు తరలించవచ్చని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నది. తొలుత గోదావరి జలాలను జైపూర్ వాగులోకి, తద్వారా సుందిళ్లకు తరలించాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం కెనాల్ ద్వారా మళ్లించేందుకు ఆర్వీ కన్సల్టెన్సీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనలను సర్కార్ ఆమోదిస్తే ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం జియోటెక్నికల్ సర్వేలు నిర్వహించి, తదుపరి డీపీఆర్‌ను సమర్పించనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సవాళ్లతో, ఆర్థిక భారంతో కూడుకున్నదని తేల్చిచెప్పిన ఎస్వీ కన్సల్టెన్సీ.. తన నివేదికలో ప్రత్యామ్నాయాలను సైతం సూచించింది. ప్రాణహితపై తమ్మిడిహట్టికి 9.5 కి.మీ. దిగువన బోలేపల్లి వద్ద బరాజ్‌ను నిర్మించవచ్చని, అందుకు అక్కడ అనువైన రాతిపొరలు కూడా ఉన్నాయని తెలిపింది.
130 మీటర్ల క్రస్ట్ లెవల్, 138 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 3.5టీ ఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించవచ్చని, అలా చేస్తే తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఎలాంటి ముంపు ఉండబోదని సదరు స్పష్టం చేసింది. నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గి రూ.2 వేల కోట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నది. ఆ బరాజ్ నుంచి జలాలను లిఫ్ట్ ద్వారా మళ్లించి, ఇప్పటికే నిర్మించిన ప్రాణహిత కెనాల్‌కు 10 కి.మీ వద్ద అనుసంధానించవచ్చని తెలిపింది.