Telangana DGP | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం యూపీఎస్సీ ముగ్గురి పేర్లను డీజీపీ పోస్టుకు సిఫారసు చేసింది. ఆ ముగ్గురిలో 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, 1994 బ్యాచ్‌కే చెందిన డాక్టర్ సౌమ్య మిశ్రా ఉన్నారు.
బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో యూపీఎస్సీ కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి మరో నెలరోజుల్లో ఉద్యోగవిరమణ చేయనుండటంతో ఆయన పేరును యూపీఎస్సీ పరిశీలించలేదు. డీజీపీ హోదాతో కనీసం 6 నెలలకుపైగా ఉద్యోగ కాలం ఉన్నవారి పేర్లనే యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకున్నది. ఈ భేటీకి యూపీఎస్సీ కమిటీ సభ్యుడి హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరయ్యారు.యూపీఎస్సీ సిఫార్సు చేసిన ముగ్గురిలో సీవీ ఆనంద్ మిగతా ఇద్దరి కంటే సీనియర్. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. దీంతో ఆయనకే డీజీపీ ఉద్యోగం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.