Aditya Om | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటూ విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు. వినూత్న రీతిలో పాటలు, నినాదాలు, ప్రదర్శనల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే నీట్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు ఆదిత్య ఓం ప్రత్యక్షంగా పాల్గొనడం విశేషంగా మారింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిలబడి వారికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అత్యవసరమని, విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.విద్యార్థుల సమస్యపై స్పందిస్తూ ఢిల్లీ వరకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపిన తెలుగు నటుడిగా ఆదిత్య ఓం నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఇతర సినీ ప్రముఖులు కూడా విద్యార్థుల సమస్యలపై స్పందించాలని అభిప్రాయపడుతున్నారు.
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో 2002లో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదిత్య ఓం తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించారు. అనంతరం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. 2013లో విడుదలైన హిందీ చిత్రం బందూక్ కు దర్శకుడిగానూ వ్యవహరించారు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొని తన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఆదిత్య ఓం, ఇప్పుడు విద్యార్థుల సమస్యపై నేరుగా స్పందించి జంతర్ మంతర్లో వారి పక్షాన నిలవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపిన మద్దతు ప్రశంసనీయమని సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు చేస్తున్నారు.