హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ‘గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు. విగ్రహాలతో ప్రేరణ లభించదు’ అని గాంధీ మునిమనుమడు తుషార్‌గాంధీ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ‘మేమే రాజులం.. మేమే రూలర్స్’ అనే భావనను పాలకులు మానుకోవాలని హెచ్చరించారు.
ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ఫెయిల్యూర్ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఇండ్లు కూల్చి గాంధీ విగ్రహాన్ని నిర్మించేందుకు సిద్ధపడటంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తే కాంగ్రెస్ సర్కార్ తప్పకుండా దిగి వస్తుందని సూచించారు. ఈ అంశంపై ఓ టీవీ చానల్లో బుధవారం చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో అందరి అంగీకారంతో నిర్ణయాలు ఉండాలని, అలా కానిపక్షంలో అది అప్రజాస్వామికం అవుతుందని రేవంత్ సర్కార్‌కు చురకలు అంటించారు. బాధితులపై తనకు సానుభూతి ఉన్నదని, తాను మాట్లాడినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని భావించడం లేదని పేర్కొన్నారు. అధికారంలో లేకుంటేనే ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీ మాట వింటారని, అధికారంలోకి వచ్చాక ఎవరి మాటా వినరని, ఆ పార్టీ సీఎం ఒకరు గతంలో తనతో చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు.