Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ చిత్రం రామాయణ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ రిలీజ్‌పైనే నిలిచింది. మొదట ఈ సినిమా ట్రైలర్‌ను జులై 24, 2026న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ ప్రణాళిక వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో మరింత పెరిగింది.
శుభప్రదమైన బ్రహ్మ ముహూర్తంలో జూలై 30,2026న మా ట్రైలర్‌తో రామాయణ ఆరంభానికి స్వాగతం పలుకుతున్నాము.గురువారం ఉదయం 4.15ని.లకి ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ షేర్ చేయగా, ఇది వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఈ పోస్ట్‌తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా చేరడం సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో మరింత క్రేజ్ తీసుకొచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పురాణ గాథను అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా, నటుడు యష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తగా, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.