Flydubai Flight : దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన విమానం సౌదీ అరేబియాలోని టబుకులో అత్యవసరంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈలోపు విమానం హైజాక్ అయినట్లు కంట్రోల్ రూంకు కోడ్ అలర్ట్ వెళ్లింది. దీంతో నిజంగానే ఫ్లైట్ హైజాక్ అయ్యిందేమో అన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం కొన్ని ప్రాథమిక అంశాలు వెల్లడయ్యాయి. విమానం కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్ మధ్య జరిగిన గొడవే దీనికి కారణం అని తెలుస్తోంది.
ఇద్దరి మధ్యా జరిగిన గొడవ కారణంగా హైజాక్ కోడ్ సిగ్నల్స్ పంపినట్లు తెలిసింది. ఈ వివాదం కారణంగా 34,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం ఏకంగా 17,400 అడుగుల దిగువకు చేరింది. అంటే, 16,600 అడుగుల దిగువకు పడిపోయింది. పైలట్ల గొడవకు సంబంధించి పైలట్‌పై కో పైలట్ దాడి చేశాడు. పైలట్‌ను కో పైలట్ కత్తితో పొడిచాడు. దీంతో పైలట్ నొప్పితో గట్టిగా అరిచాడు. వెంటనే గమనించిన కొందరు ప్రయాణికులు కాక్ పిట్ డోర్ బ్రేక్ చేసి, లోపలికి వెళ్లారు. కోపైలట్‌ను అదుపుచేసి, పట్టుకున్నారు.
🚨 Cockpit video is now out
Shows a bloody altercation, with one of the pilots seen soaked in blood
A Flydubai flight from Dubai to Tel Aviv was forced to divert to Saudi Arabia after what authorities described as a “violent incident” between two pilots
The aircraft… pic.twitter.com/p3eIQ58Ndw
— Nabila Jamal (@nabilajamal_) September 30, 2026
ఈ ఘటనలో పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి రక్తస్రావం జరిగింది. ఇద్దరిలో ఒక పైలట్ ఒమన్ దేశానికి చెందిన వాడిగా తెలుస్తోంది. ఒక పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీన్ని మరొక పైలట్ అడ్డుకున్నాడు. కాక్‌పిట్‌లో చాలా రక్తస్రావం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. అయితే, విమానంలో అదృష్టవశాత్తు పైలట్ల రెండో టీం ఉంది. దీంతో గొడవకు దిగిన పైలట్లను పక్కకు తొలగించి.. రెండో టీం పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఇజ్రాయెల్ వెళ్లాల్సిన విమానం సౌదీలో ల్యాండ్ కావడం చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఇజ్రాయెల్ విమానాలు సౌదీకి వెళ్లేది అరుదు. సౌదీ, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు లేవు. ఇదే సమయంలో రెండు యుద్ధ విమానాల్ని ఇజ్రాయెల్ ఫ్లై దుబాయ్ విమానానికి రక్షణగా పంపింది. విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఏదైనా ఉగ్ర కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.