రుద్రంపూర్, సెప్టెంబర్ 30 : పైప్లైన్ కోసం రోడ్లు తవ్వారు.. పైప్లైన్ పనులు పూర్తయ్యాయి. కానీ రోడ్లకు మాత్రం మరమ్మతులు చేపట్టలేదు. ఫలితంగా రుద్రంపూర్, గౌతంపూర్ కార్మిక కాలనీల్లో రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలు పడుతున్న సమయంలో గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కొత్తగూడెం ఏరియా జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శనివారం రుద్రంపూర్, గౌతంపూర్ కార్మిక కాలనీల్లో జీఎం పర్యటించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించారు. రోడ్ల పరిస్థితిపై కార్మికులు, స్థానికులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు జీఎం సూచించారు.

గుంతలమయంగా రుద్రంపూర్–గౌతంపూర్ ప్రధాన రహదారి
కాలనీల్లో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని కార్మికులు వాపోతున్నారు. కొత్త రోడ్ల నిర్మాణానికి సివిల్ అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని చెబుతున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ఎందుకు ప్రారంభించలేదన్నది స్పష్టత లేకుండా ఉందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలం కారణంగా ప్రస్తుతం శాశ్వతంగా రోడ్లు వేయలేమని సివిల్ అధికారులు చెబుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే వర్షాకాలం ముగిసే వరకు రోడ్లను అలాగే వదిలేయడం సరికాదని కార్మికులు అంటున్నారు. రైల్వే స్లైడింగ్ పనులు జరుగుతున్న ప్రాంతం నుండి లభించే సుద్దమట్టి వంటి మెటీరియల్తో గుంతలను తాత్కాలికంగా పూడ్చాలని కోరుతున్నారు.