న్యూఢిల్లీ, జూలై 28 : గత ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. కరెంట్/సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వల మొత్తాలను నిర్వహించని కస్టమర్ల నుంచి దాదాపు రూ.7,087 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు రూ.4,948.71 కోట్లు, సర్కారీ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఓ ప్రశ్నకుగాను మంగళవారం రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ.1,798.14 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ (రూ.1,081.33 కోట్లు) ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) వివరాలను మంత్రి పేర్కొన్నారు. అలాగే మొత్తం 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు చేసిన వసూళ్లలో హెచ్డీఎఫ్సీ, యాక్సిస్‌ల వాటానే 58 శాతంగా ఉన్నట్టు చెప్పారు. అయితే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు సహా ఇతర బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఈ చార్జీలేవీ పడలేదని స్పష్టం చేశారు. కాగా, గడిచిన 4 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు ఇలా ఖాతాల్లో కనీస నగదు నిల్వల్లేకపోతే ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలు రూ.26, 170.37 కోట్లుగా ఉండటం గమనార్హం.
కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) అధికారులు.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.75,000 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాన్ని గుర్తించారు. అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్రల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ మేరకు సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాచారమిచ్చారు. ఐరన్ అండ్ స్టీల్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, పేపర్ ప్రొడక్ట్స్, ైప్లెవుడ్, సిమెంట్, కాపర్ వంటి గూడ్స్‌తోపాటు కాంట్రాక్ట్ సర్వీస్, మ్యాన్‌పవర్ సైప్లె సర్వీసెస్, రియల్ ఎస్టేట్ సర్వీసెస్ వంటి సేవల్లోనూ పన్ను ఎగవేతల్ని గుర్తించామని చెప్పుకొచ్చారు. మొత్తం 30,162 కేసులు నమోదయ్యాయని, వీటి విలువ రూ.74,782 కోట్లుగా ఉందని మంత్రి వివరించారు. గుజరాత్లో 12,511 కేసులు (రూ.12,633 కోట్లు), మహారాష్ట్రలో 9,629 కేసులు (18,320 కోట్లు) నమోదయ్యాయి. ఇక మొత్తంగా 2025-26లో 358 మంది అరెస్టయ్యారు.
గత కొన్నేండ్లుగా దేశంలోకి నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గుతున్నాయని పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2022-23లో 27.99 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2025-26లో 6.95 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు రాజ్యసభలో మంత్రి ప్రకటించారు. కాగా, విదేశీ మదుపర్లు తమతమ దేశాలకు పంపుతున్న నిధులు పెరుగడం, అలాగే భారత్ నుంచి పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటమే కారణమని చెప్పారు. 2023-24లో 10.13 బిలియన్ డాలర్లుగా ఉన్న నికర ఎఫ్‌డీఐ.. 2024-25లో 960 మిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలను ఊటంకిస్తూ వివరించారు. నిజానికి గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి రికార్డు స్థాయిలో 94.84 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అయితే మళ్లీ 88 బిలియన్ డాలర్లదాకా తరలిపోయాయి.