ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి రోడ్లు వేయాలని కోరుతూ.. గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కొండపర్తి నుంచి భట్టుపల్లి రోడ్డు, కొండపర్తి నుంచి వరంగల్ రోడ్డు, కొండపర్తి నుంచి వనమాల కనపర్తి రోడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందంటూ ఆదివారం రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్టోంబర్ 2023 నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి రోడ్డు పనులు మొదలు పెట్టింది.
పనులు మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకు సుమారుగా రెండు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్లపై ప్రయాణం చేయాలంటే రోజు నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు ముందుగా గ్రామానికి పెండింగ్లో ఉన్న రోడ్లుకు పరిష్కరం చూపించిన తరువాతే ఎన్నికల్లో పాల్గొనాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అల్లదాస్ తరుణ్, కట్కూరి శ్రావణ్, జిడి పృధ్వీ, ఇల్లందుల ప్రమోద్, కట్కూరి హరీష్, కట్కూరి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.