– వివరాలు వెల్లడించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు
కొండామల్లేపల్లి, మార్చి 08 : ముంబై నుండి చెన్నైకి వెళ్తున్న రూ.40 లక్షల విలువైన కెమికల్ లోడును దారి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. కర్ణాటకకు చెందిన వ్యాపారి ఎస్.కె. షరీఫ్‌కు చెందిన లారీ ఫిబ్రవరి 6న ముంబై నుండి 112 డ్రమ్ముల గ్లిజరిన్ కెమికల్ లోడుతో చెన్నైకి బయల్దేరింది. అయితే లారీ డ్రైవర్ ప్రకాశ్ రాజేంద్ర సకరే మరో ఆరుగురు సభ్యులతో కలిసి ముందే పథకం రచించాడు. ఫిబ్రవరి 8న రాత్రి సమయంలో కొండమల్లేపల్లి సమీపంలోని సాగర్ రోడ్డులో గల ఒక దాబా వద్ద లారీని నిలిపి పక్కా ప్లాన్ ప్రకారం లోడును దొంగలించి పరారయ్యారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చెన్నారం గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రధాన నిందితుడు ప్రకాశ్ రాజేంద్ర సకరే పట్టుబడినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన లారీ, రూ.2.50 లక్షల నగదు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని వివరించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొండమల్లేపల్లి సీఐ ఎన్.నవీన్ కుమార్, ఎస్ఐలు ఏ.రమేశ్, షేకర్, క్రైమ్ టీం సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులను అందజేశారు. ఈ కేసును పర్యవేక్షించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా పోలీసు బృందాన్ని ప్రశంసించినట్లు ఆయన తెలిపారు.

అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్