Current Wires | ఝరాసంగం, ఆగస్టు 5 : ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన రైతు బక్కన్న వ్యవసాయ పొలంలో గత నెల రోజుల క్రితం కురిసిన గాలి, వర్షానికి విద్యుత్ వైర్లు తెగి పూర్తిగా నేలపై పడిపోయాయని స్థానిక రైతులు తెలిపారు. విద్యుత్ వైర్లు నేలపై పడిన వెంటనే సంబంధిత లైన్మెన్తోపాటు ఏఈ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ‘త్వరలో మరమ్మతులు చేస్తాం’ అని చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజులుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపై ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని వాపోయారు. అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే స్పందించి విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి తమ పంటలను కాపాడాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు.
