VB-G RAM-G | గాంధారి: గాంధారి మండలంలోని పోతంగల్ కుర్దు, సీతాయిపల్లి గ్రామపంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న VB-G RAM-G పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణాన్ని అన్ని గ్రామపంచాయతీల్లో విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో భాగంగా పోతంగల్ కుర్దు గ్రామపంచాయతీలో VB-G RAM-G పథకం కింద నిర్మించిన ఫామ్ పాండ్, కొబ్బరి బండ్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్‌ను వినియోగిస్తున్న రైతుతో మాట్లాడి పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఫామ్ పాండ్‌లో చేపల పెంపకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని రైతు కలెక్టర్‌కు తెలిపారు. అలాగే ఫామ్ పాండ్‌లో నిల్వ చేసిన నీటిని సాగునీటిగా వినియోగించడం వల్ల యూరియా వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా మెరుగుపడిందని వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యంగా VB-G RAM-G పథకం కింద అర్హులైన రైతులను గుర్తించాలని అన్నారు. గాంధారి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పెద్ద ఎత్తున ఫామ్ పాండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీతాయిపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న భూభారతి రీ-సర్వే పనులను పరిశీలించారు. ప్రస్తుతం బౌండరీ ఫిక్సింగ్ పనులు కొనసాగుతుండగా, ఇప్పటివరకు 11.5 కిలోమీటర్ల బౌండరీ ఫిక్సింగ్ పూర్తయిందని అధికారులు వివరించారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఐకేపీ (IKP) కార్యాలయాన్ని సందర్శించి మహిళలు కుడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లను పరిశీలించారు. యూనిఫామ్‌ల నాణ్యత, కుట్టు పనితీరును పరిశీలించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో కలెక్టర్‌తో ఆర్డీవో మస్తా ప్రభాకర్, సర్పంచ్ సంతోష్, అంజాద్, తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఏడీ సర్వేయర్ శ్రీనివాస్, ఏపీఎం లక్ష్మీ ప్రసన్న, ఏపీవో మధు, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, అధికారులు ఉన్నారు.