PM Modi : ఎన్డీయే (NDA) నుంచి కొత్తగా రాజ్యసభ (Rajya Sabha) కు ఎన్నికైన ఎంపీలకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా ఆయన కొత్త ఎంపీలతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. జూన్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National President) నితిన్ నబీన్ (Nitin Nabin) కూడా ఉన్నారు. వ్యక్తిగత ప్రవర్తన సహా రాజ్యసభలో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై వారికి మోదీ దిశానిర్దేశం చేశారు.
వీలైనంత వరకు సభకే ఎక్కువ సమయం కేటాయించాలని, 100 శాతం అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని సూచించారు. సొంత పార్టీ నేతల నుంచే కాకుండా ప్రతిపక్ష ఎంపీల నుంచి కూడా మంచి విషయాలను నేర్చుకోవాలని హితవుపలికారు. తన వ్యక్తిగత దినచర్య గురించి పలువురు ఎంపీలు అడుగగా ప్రధాని స్పందించారు. తాను నిద్రకు ఉపక్రమిస్తే ఎనిమిది సెకన్లలోపే నిద్ర పట్టేస్తుందని చెప్పారు. రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే వర్తమానంలో జీవించడం ఎంతో ముఖ్యమని ప్రధాని అన్నారు. ఈ క్రమంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ విమానం ఎక్కిన వెంటనే తాను వెళ్తున్న దేశం కాలమానానికి తగ్గట్టుగా గడియారంలో సమయాన్ని సర్దుబాటు చేసుకుంటానని ప్రధాని తెలిపారు. దానివల్ల ఏ దేశానికి వెళ్లినా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.