స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్‌ను అందుబాటులోకి తేవడంతో అనుమతుల ప్రక్రియ సులభతరమైంది. దీంతో అనేక మంది యువ పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. తొమ్మిదేండ్లలో వందలాది పరిశ్రమలు ఏర్పాటు కావడంతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. అడుగడుగునా అణిచివేతకు గురవుతున్న దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం.. ఎంతో మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చింది. ఒకనాడు కూలీలుగా ఉన్న వారు నేడు యజమానులుగా మారారు. మరో మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
కామారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దూసుకెళ్తోంది. జిల్లా మీదుగా జాతీయ రహదారులు, రైల్వే సౌకర్యం ఉండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేయడం, టీఎస్-ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టి పరిశ్రమల అనుమతులను సులభతరం చేసింది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన 2016 నుంచి 2023 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా 11,369 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం విశేషం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధిపై అందిస్తున్న కథనం…
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లోనూ భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అనేక విధానపరమైన మార్పులు తీసుకువచ్చారు. పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపు, వివిధ శాఖల నుంచి అనుమతుల జారీ, విద్యుత్ సరఫరా, సబ్సిడీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంతో నేడు అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలను స్థాపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రూ.1928.59 కోట్లతో 22 భారీ, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించారు. ఇందులో 2,397 మందికి ఉపాధి కల్పించారు. జిల్లాలో 13 సౌర విద్యుత్ ఉత్పతి పరిశ్రమలను స్థాపించారు. అలాగే జిల్లాలో 1381 చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు రూ.929 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడ్డాయి. ఇందులో 7,555 మందికి ఉపాధి లభించింది.
పరిశ్రమల స్థాపనలో అనుమతుల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన అనుమతుల స్వీయ ధ్రువీకరణ చట్టం-2014 (టీఎస్-ఐపాస్ యాక్టు-2014) అమలుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విధానంలో సింగిల్‌విండో ద్వారా కాలుష్య మండలి, వాణిజ్య పన్నుల శాఖ, పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులు జారీ చేస్తారు. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేయడంతో పారిశ్రామిక వేత్తలకు ఎంతో సౌలభ్యం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 448 పరిశ్రమలకు సంబంధించి 1040 అనుమతులు పొందడానికి పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోగా 882 అనుమతులు వివిధ శాఖల ద్వారా ఇచ్చారు. 32 అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. 131 తిరస్కరించారు. 378 పరిశ్రమలను స్థాపించి, పారిశ్రామిక వేత్తలు రూ.3,838 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి 8,043 మందికి ఉపాధి కల్పించారు. నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయడంతో టీఎస్-ఐపాస్ ‘బీ’ కేటగిరి జిల్లాల విభాగంలో కామారెడ్డి జిల్లా 2వ స్థానంలో నిలిచి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నది.
జిల్లాలో టీ-ఐడియాలో జనరల్ లబ్ధిదారులకు పురుషులకు 15శాతం, స్త్రీలకు 25 శాతం, టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగ లబ్ధిదారులకు పురుషులకు 35 శాతం, స్త్రీలకు 45 శాతం రాయితీపై జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,434 యూనిట్లను రూ.179.07 కోట్లతో మంజూరు చేశారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2022-23 సంవత్సరంలో నిరుద్యోగ యువతీ యువకులకు సొంత పారిశ్రామిక/సేవా రంగానికి సంబంధించిన యూనిట్లు స్థాపించేందుకు జిల్లా అధికారులు కృషి చేశారు. ఈ సందర్భంగా 220 మంది లబ్ధిదారుల్లో 40 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.126.99లక్షల చొప్పున అందజేశారు.
వివిధ ఆర్థిక సంస్థలైన బీసీ,ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు 7,442 మంది లబ్ధిదారులకు రూ.99.40కోట్ల సబ్సిడీతో స్వయం ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్లను మంజూరు చేశారు.
Ts Ips
ఖలీల్‌వాడి, జూన్ 5 : స్వరాస్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని చాటేందుకు మంగళవారం చేపట్టనున్న పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీఎస్ ఐ-పాస్ విధానంతో సింగిల్ విండో పద్ధతిలో అనుమతుల మంజూరీని సులభతరం చేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వివరించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను జిల్లాలకు విస్తరించడం గ్రామీణ ప్రాంత యువతకు వరంగా మారింది. జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో అధునాతన హంగులతో నెలకొల్పిన ఐటీ హబ్ తుదిదశ పనులను సైతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాం గం ప్రత్యేక చొరవ, సంప్రదింపులతో ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు నిజామాబాద్ ఐటీ హబ్ కేంద్రంగా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత తెలుపుతూ పరస్పర ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన లభించనున్నది. అలాగే, వ్యవసాయాధారిత జిల్లా కావడంతో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో ఔత్సాహిక పారిశ్రామికులను ఆకర్షిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ రాయితీలు, ఇతరత్రా తోడ్పాటును వినియోగించుకుంటూ పదుల సంఖ్యలో కొత్తగా రైస్‌మిల్లులను నెలకొల్పారు. ఆగ్రోస్ బెస్ట్ ఇండస్ట్రీస్ సైతం ఏర్పాటయ్యాయి. ఈ విషయాలను అధికారులు నేటి పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో తెలియజేసి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుపై అవగాహన కల్పించనున్నారు.
నిజాంసాగర్: గ్రామంలో మొన్నటి దాక కూలీ పనులతో పాటు పౌల్ట్రీ ఫామ్‌లో కూలీ పని చేసేవాడిని. సీఎం కేసీఆర్ సార్ దళితబంధు పథకం మంజూరు చేయ డంతో పౌల్ట్రీ ఫామ్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం అందించిన పది లక్షలతో ఐదు వేల కోళ్లు ఉత్పత్తి అయ్యేలా గ్రామంలో పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసుకున్నాను. 20 రోజుల కిందటే కోళ్లను విక్రయించాను. అన్ని ఖర్చులు పోనూ రూ.లక్ష మిగిలాయి. చాలా సంతోషంగా ఉంది. జీవితంలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేస్తా అనుకోలేదు. అంతా ముఖ్యమంత్రి సారు దయతోనే..
-దాసరి సాయిలు, మహ్మద్‌నగర్
దళితబంధు పథకం కింద నాకు పది లక్షలు మంజూరయ్యాయి. నాకు రెండు ఎకరాల పొలం ఉండడంతో దళితబంధు పథకంలో చేపల చెరువును ఎంపిక చేసుకున్నా. పది లక్షల వ్యయంతో నా పొలంలో చేపలను పెంచేందుకు చేపల పెంపకం యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నా. రెండు వేల చేప పిల్లలను పెంచేందుకు కుండీలను ఏర్పాటు చేసుకున్నా. ఎనిమిది నెలల్లో చేపలు అమ్ముకునేందుకు చేతికి రాగా పెట్టుబడులు పోనూ నాలుగు లక్షల వరకు లాభం వచ్చింది. ఇక కూలీ పనుల నుంచి చేపల చెరువుకు ఓనర్‌గా మారినందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు పుణ్యమా అంటూ దర్జాగా బతుకుతున్నాం.
గైని సాయవ్వ, నర్సింగ్‌రావ్‌పల్లి, నిజాంసాగర్ మండలం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ సింగిల్‌విండో విధానం ఎంతో బాగుంది. దీంతో పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభిస్తు న్నాయి. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ శాఖల అధికారుల వద్ద చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అన్ని పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొంటే, పత్రాలన్నీ సరైనవి ఉంటే వెంటనే అనుమతులను జారీ చేస్తున్నారు. ఈ విధానం ఎంతో పారదర్శకమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి విధానాలతో పరిశ్రమలు పెరుగుతాయి.
-నాగులగామ వెంకన్న, పారిశ్రామికవేత్త, బాన్సువాడ
దళితుల్లో ఎన్నో నైపుణ్యాలు ఉన్నా, వాటిని సరిగా వినియోగించుకోలేకపోవడానికి ప్రధాన అడ్డంకి ఆర్థిక వెనుకబాటుతనం. వివిధ ఆర్థిక అభివృద్ధి పథకాల ద్వారా ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ‘దళిత బంధు’. ఈ పథకం కింద జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం 350 యూనిట్లను మంజూరు చేశారు. వీటికి రూ.35కోట్లు కేటాయించి, లబ్ధిదారుల ఆసక్తి మేరకు వాహనాలు, టెంట్ హౌస్‌లు, సెంట్రింగ్, పాడి గేదెలు, కోళ్ల పరిశ్రమలు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 1298 దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేశారు.
కామారెడ్డి జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంది. టీఎస్ ఐ-పాస్ ద్వారా అనుమతులు జారీ అవుతున్నాయి. ఈ విధానంతో నిర్ణీత గడువు లోగా అనుమతులను జారీ చేస్తున్నాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు సరైన పత్రాలు అందిస్తే వెంటనే అనుమతులు జారీ చేస్తున్నాం. వివరాలు సరిగా లేని వారికి సంబంధించి 132 దరఖాస్తులను తిరస్కరించాం.
– రఘునాథ్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కామారెడ్డి