Donald Trump : విదేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా (US) లో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టంచేశారు. విదేశీ విద్యార్థులు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇది దేశ ఉన్నత విద్యావ్యవస్థకు మద్దతుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.
అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘విదేశాల నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించకూడదు. దానివల్ల మన విశ్వవిద్యాలయ, కళాశాల వ్యవస్థ నాశనమవుతుంది. నేను అలా జరగనివ్వను. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఉండటం మంచిది. నేను ప్రపంచంతో కలిసి ఉండాలని అనుకుంటున్న’ అని వ్యాఖ్యానించారు.
అమెరికాకు వచ్చేవారిని సగానికి తగ్గిస్తే కొంతమందికి సంతోషాన్ని ఇస్తుందని, అయితే దేశంలోని సగం కళాశాలలకు వ్యాపారం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. దేశీయ విద్యార్థులతో పోలిస్తే విదేశాల నుంచి వచ్చేవారు రెట్టింపు కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలకు, ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలకు ఎలాంటి పొంతన లేదు.