మణికొండ, ఫిబ్రవరి 19: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగతనాలతోపాటు గ్యాంగ్‌రేప్‌ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. గతంలో ఈ ప్రాంతంలో పలు రకాల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, హత్యలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా దారిదోపిడీ ఘటనలు జరిగాయి. ఇప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి సామూహిక లైంగికదాడి చేసిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… 16 ఏండ్ల బాలిక నార్సింగి సర్కిల్ పుప్పాలగూడలోని తన అమ్మమ్మ వద్ద ఉంటూ పదోతరగతి చదువుతున్నది. ఈనెల 16న ఉదయం స్కూల్‌కు వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో మరుసటిరోజు బాలిక తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఏడు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 7న బాలిక చార్మినార్‌లో షాపింగ్‌కు వెళ్లింది. అక్కడ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఈ నెల 16న బాలిక స్కూల్‌కు వెళ్తున్నానంటూ చెప్పి ఆ బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి చార్మినార్ చుట్టూ తిరిగిన తర్వాత ఆ బాలుడు తన స్నేహితుడు ఇమ్రాన్, మరో బాలుడితో కలిసి ఆమెను ఆటోలో చెంగిచర్ల ప్రాంతంలోని డబుల్‌బెడ్ రూమ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో బెదిరించి, బలవంతంగా మద్యం నోట్లో పోసి సామూహిక లైంగికదాడి చేశారు. అంతటితో ఆగకుండా బాలికను వివస్త్రను చేసి అక్కడే వదిలేసి పరారయ్యారు.
చెంగిచర్ల వద్ద ఉన్న డబుల్బెడ్రూమ్ ఇంటిలో ఓ బాలిక దీనస్థితిలో ఉన్నట్టు తెలుసుకున్న నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను చికిత్సనిమిత్తం దవాఖానకు తరలించారు. ఈనెల 18న చెంగిచర్లలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో బాలుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఇమ్రాన్, అతనితోపాటు మరో ఇద్దరు మైనర్లపై నార్సింగి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇమ్రాన్ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తేల్చారు. అతడిపై దోపిడీ, దొంగతనం, లైంగికదాడి వంటి 8 కేసులున్నట్టు గుర్తించారు. రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో అనుమానితుడిగా షీట్ ఓపెన్చేసినట్టు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు.