BEd Admissions | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కోర్సు అయిన బీఈడీకి మళ్లీ డిమాండ్ పెరుగుతున్నది. కొంత కాలంగా ఈ కోర్సులో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. ఈసారి 13,695 సీట్లకుగాను మొదటి విడతలోనే 9,407 మంది సీట్లు దక్కించుకున్నారు.
ఎడ్సెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం కన్వీనర్ కోటాలో 13,695 సీట్లుండగా, ఈసారి 15,009 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరిలో 9,407 మంది సీట్లు దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్నవారు ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
2025లో మొదటి విడతలో 4,474 మంది రిపోర్ట్ చేయగా, రెండో విడతలో 7,441 మంది సీట్లు దక్కించుకున్నారు. అంటే రెండు విడతల్లో 11వేలకు పైగా సీట్లు నిండాయి. ఈసారి మొదటి విడతలోనే 9వేల సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి 81.85 శాతం సీట్లను మహిళలే దక్కించుకున్నారు.