న్యూఢిల్లీ: తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రూపొందించినదంంటూ ఊదరగొట్టి చైనాలో తయారైన రోబోటిక్ డాగ్‌ను ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రదర్శించి తన పరువు తీసుకున్న గల్గోటియాస్ యూనివర్సిటీ తర్వాత ఇప్పుడు విప్రో వంతు వచ్చింది. అదే విధమైన రోబో డాగ్‌ను ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శించిన విప్రోపై విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. అయితే విప్రో డెమో రోబో మీద కాకుండా దాని ఇన్స్పెక్ట్ ఏఐ సొల్యూషన్‌పై దృష్టి పెట్టిందని కొందరు పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది. భారత్‌లోని దిగ్గజ ఐటీ సర్వీసుల కంపెనీల్లో ఒకటైన విప్రో సంస్థ చైనీస్ టెక్ కంపెనీ యూనిట్రీ రూపొందించిన గో2 రోబో ఓరియోన్ని పోలినట్లు ఉన్న రోబో డాగ్‌ను ఇండియా ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శిస్తున్న వీడియోను కొన్ని వెబ్సైట్లు ప్రసారం చేశాయి. ఇదే రోబోను తామే రూపొందించినట్లు హర్యానాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ సమ్మిట్‌లో ప్రదర్శించి ఇటీవల అభాసుపాలైంది. దీనికి టీజే అని కూడా విప్రో నామకరణం చేసింది. నిర్వహణ లోపం కారణంగా తొలి రోజే తీవ్ర విమర్శల పాలైన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గల్గోటియాస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఎక్స్‌పోలో మీడియాతో విప్రో ప్రతినిధి మాట్లాడుతూ, మనుషులు ప్రవేశించడానికి వీల్లేని ప్రమాదకర ప్రదేశాలకు టీజే(రోబో డాగ్) వెళ్లగలదు. ఈ రోబోతో మనం తనిఖీలు నిర్వహించవచ్చు. ఇది తుప్పు పట్టడం వంటి హానికరమైన దృశ్యాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారించగల ఇన్ బిల్ట్ ఏఐ మోడల్ అని తెలిపారు.
కృత్రిమ మేధ అతి వేగవంతమైన పురోగతి కారణంగా అమెరికాలోని లక్షలాది మంది వైట్-కాలర్ ఉద్యోగులు రానున్న 12-18 నెలల కాలంలో తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పారిశ్రామికవేత్త, డెమోక్రాటిక్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యంగ్ హెచ్చరించారు. అమెరికాలోని 7 కోట్ల మంది వైట్‌కాలర్ ఉద్యోగుల్లో 20-50 శాతం మందికి ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ‘మా కుటుంబ సభ్యులు కొందరు ఏఐకు ఒక పని అప్పగిస్తే అది నిముషాల్లో పూర్తి చేసింది. అదే ఒక డిజైనర్ లేదా సంస్థ అయితే అదే పనిని పూర్తి చేయడానికి కొన్ని రోజుల పాటు తీసుకుంటుంది.’ అని పేర్కొన్న ఆయన ఇదే తరహా నైపుణ్యం అన్ని తరహా రంగాల్లో ఏఐ చూపుతుందని, దీని కారణంగా ఉద్యోగాలకు ముప్పు తప్పదని అన్నారు. ఇప్పటికే కాల్ సెంటర్ సిబ్బంది, మార్కెటీర్లు, కోడర్లు వంటి మధ్య తరహా ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడిందని, ఇది వైట్-కాలర్ ఉద్యోగాలకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్టు చేపడితే.. సమాచార సేకరణ, దాని విశ్లేషణ, సమర్పణ, నిర్ణయాధికారం వంటి వివిధ దశలుగా సాగుతుందని, ఈ అన్ని దశల్లోనూ ఆయా విభాగాలకు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇప్పుడు నిర్ణయాధికారం సహా అన్ని పనులను ఏఐ చేసే రోజులు వస్తున్నాయని, దీని కారణంగా వైట్-కాలర్ ఉద్యోగుల మనుగడే ప్రమాదకరంగా మారనుందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్ ఏఐ సమ్మిట్ సాక్షిగా ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ అల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈవో అమోడీ డారియో అమోడీ మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. భారత్ మండపంలో గురువారం ఇది చోటు చేసుకుంది. సమావేశానికి విచ్చేసిన పలు గ్లోబల్ టెక్ లీడర్లు ప్రధాని నరేంద్ర మోదీతో గ్రూప్ ఫొటో దిగారు. ఇక్కడే తమ ఇద్దరి మధ్య విభేదాలున్న సంగతిని ఇద్దరూ బాహాటంగా చాటిచెప్పారు. మోదీతో ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, సర్వం సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్, గూగుల్ డీప్ మైండ్ సీఈవో డెమిస్ హస్సాబీస్లు కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ప్రధాని మోదీ మధ్యలో నిల్చోగా సుందర్ పిచాయ్ కుడివైపున అల్ట్మన్ ఎడమవైపున, అతని పక్కన అమోడీ నిల్చున్నారు. తమ మధ్య ఐక్యతకు చిహ్నంగా చూపెడుతూ ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసి వాటిని పైకెత్తారు. అయితే అల్ట్మన్, అమోడీలు ఒకరు చేతులు మరొకరు పట్టుకోకుండానే తమ చేతులు పైకెత్తి తమ మధ్య ఉన్న విరోధాన్ని ప్రపంచానికి మరోసారి చాటారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సామ్ అల్ట్మన్ తర్వాత దానిపై స్పందించారు. గ్రూప్ ఫొటో సందర్భంగా ఇబ్బందికర క్షణం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తాను ఒక విధమైన గందరగోళంలో ఉన్నానని, ఆ క్షణంలో ఏమి చేయాలో తనకు తెలియలేదని ఆయన పేర్కొన్నారు.
భారత్ డిజిటల్ రంగంలో వేగంగా మార్పులు భారత్ డిజిటల్ రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. ఏఐ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ‘భారత్ ఏఐ కేంద్రంగా మారుతున్నది. ఇక్కడి మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నా’ అంటూ ప్రశంసించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ, డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నదని ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజలకు భారత్ డిజిటల్ ఐడెంటిటీ తీసుకొచ్చిందని అన్నారు. ఏఐ కృత్రిమమైంది కాదు..వాస్తవమైందని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. మనుషులు చేసే అత్యంత క్లిష్టమైన పనులను కూడా ఏఐ మోడల్స్ సులువుగా పూర్తిచేసే రోజులు వస్తాయని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అన్నారు.
మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని శాసించాలని సూచించారు. కృత్రిమ మేధ వినియోగంలో ‘మానవ్ దార్శనికత’ ఉండాలని గురువారం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని పిలుపునిచ్చారు. మానవ్ అర్థాన్ని ఆయన వివరిస్తూ ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్(నైతిక విలువలు), ఏ అంటే అకౌంటబిలిటీ(జవాబుదారీతనం), ఎన్ అంటే జాతీయ సార్వభౌమత్వం, ఏ అంటే అందరికీ అందుబాటులో ఉండం, వీ అంటే వ్యాలిడ్ అండ్ లెజెటిమేట్(చట్టబద్ధం, విశ్వసనీయంగా పనిచేయడం) అని వివరించారు. భారత్ ఏఐకి భయపడదని, దానిలో అదృష్టాన్ని, రేపటి బ్లూప్రింట్‌ను చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏఐ కోసం ప్రధాని మోదీ మానవ్ దార్శనికతను కాంగ్రెస్ తప్పుపట్టింది. మానవ్లోని ఇంగ్లిష్ అక్షరాలను ప్రధాని మోదీ వివరించిన తీరును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు. ఈ అక్రోనిమ్(ఒక పదబంధంలోని మొదటి అక్షరం) వైరస్‌కు చికిత్స లేదు అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రోబో డాగ్ వీడియోను బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఆన్లైన్లో షేర్ చేసి సామాజిక మాధ్యమ దృష్టిని ఆకర్షించింది. స్టార్టప్ కంపెనీ జనరల్ అటానమీ తయారు చేసిన ఈ స్వదేశీ చతుర్భుజి రోబోకు ‘పరమ్’అని పేరు పెట్టారు. ఇది భారత్‌లో అత్యంత శక్తిమంతమైన రోబో డాగ్‌గా పేర్కొన్న నిర్వాహకులు ఇది స్థానికంగా అమర్చడమే కాకుండా భారత ఇంజినీర్లు దీన్ని నిర్మించారని తెలిపారు. దృఢంగా ఉన్న ఈ పరమ్ బెంగళూరు ట్రాఫిక్‌లో నడవడం వీడియోలో కన్పించింది. ఎదురుగా వచ్చే అడ్డంకులను దానికదే అధిగమించడం, తక్కువ ఎత్తులో ఉన్న మెట్లను ఎక్కేస్తూ, క్రాబ్ వాకింగ్ చేస్తూ ఉన్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇది స్వతంత్రంగా నావిగేషన్, ట్రాకింగ్ చేసుకోగలదని, పడిపోయినా దానికదే లేచి నిల్చునే శక్తి దీని సొంతమని వారు చెప్పారు.